Friday, November 22, 2024

Delhi | సుప్రీంకోర్టులో చంద్రబాబుకు నిరాశ.. విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ భట్టి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. క్వాష్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబుకు బుధవారం ఎలాంటి ఊరట లభించలేదు. తొలుత ఈ పిటిషన్‌ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం ఎదుట బుధవారం భోజన విరామం అనంతరం విచారణకు వచ్చింది. అయితే ధర్మాసనంలోని రెండో న్యాయమూర్తి జస్టిస్ సరస వెంకట నారాయణ భట్టి ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు.

ఆ విషయాన్ని జస్టిస్ సంజీవ్ ఖన్నా వెల్లడిస్తూ.. తన సహ న్యాయమూర్తికి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. అప్పటికి చంద్రబాబు తరఫున వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ లూత్రా, హరీశ్ సాల్వే సహా మరికొందరు సీనియర్ న్యాయవాదులు సిద్ధంగా ఉన్నారు. జస్టిస్ భట్టి విచారణ నుంచి వైదొలగడంతో కేసును మరో బెంచ్‌కు బదిలీ చేస్తూ అక్టోబర్ 3కు వాయిదా వేస్తానని జస్టిస్ ఖన్నా తెలిపారు. ఈ పరిస్థితుల్లో తమకు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట మెన్షన్ చేసుకోడానికి అవకాశం కల్పించాలని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా కోరారు.

అందుకు ధర్మాసనం అంగీకరించడంతో.. కాసేపటికే ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట చంద్రబాబు తరఫు న్యాయవాదులందరూ ప్రత్యక్షమయ్యారు. అక్కడ కేసును మెన్షన్ చేస్తూ.. వీలైనంత త్వరగా విచారణ తేదీని ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈలోగా కొన్ని వెసులుబాట్లు కల్పించాలని అభ్యర్థించారు. ఆ క్రమంలో వాదోపవాదాలు జరిగాయి.

- Advertisement -

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 (ఏ) చంద్రబాబు నాయుడుకు వర్తిస్తుందని, దర్యాప్తు సంస్థ సీఐడీ ముందస్తు అనుమతి తీసుకోకుండా చంద్రబాబును ఎఫ్.ఐ.ఆర్ లో చేర్చి, అరెస్టు చేసిందని సిద్ధార్థ్ లూత్రా చెప్పారు. సీఐడీ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాజకీయ కక్షసాధింపు జరుగుతోందని, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒకదాని వెంట మరొక ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే ఇందుకు నిదర్శనమని లూత్రా అన్నారు. ఏ కేసులోనైనా ఏ వ్యక్తినైనా అరెస్టు చేసిన తర్వాత తొలి 15 రోజుల్లోగా పోలీస్ కస్టడీ తీసుకోవాల్సి ఉంటుందని సీఆర్పీసీ సెక్షన్ 167(2) చెబుతోందని, కానీ చంద్రబాబును అరెస్టు చేసి 15 రోజులు దాటినప్పటికీ సీఐడీ తమ కస్టడీకి అప్పగించాలని కోరుతోందని తెలిపారు. ఇదే సీఐడీ వైఖరిని తెలియజేస్తోందని అన్నారు. సీఐడీ కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేయవద్దని ఆదేశాలివ్వాలని లూత్రా కోరారు. ఈ దశలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ జోక్యం చేసుకుంటూ.. ఈ విషయంలో తాము ట్రయల్ కోర్టు జడ్జిని నియంత్రించబోమని స్పష్టం చేశారు.

మరోవైపు కేవియట్ దాఖలు చేసి కేసు విచారణలో భాగమైన సీఐడీ తరఫు న్యాయవాదులు లూత్రా వాదనలతో విబేధించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో 90:10 నిష్పత్తిలో సీమెన్స్ పెట్టుబడి పెడుతుందని పేర్కొని, తీరా ఒప్పందం చేసుకునే సమయానికి మొత్తం మార్చేశారని, ఆ తర్వాత అనేక దశల్లో అవకతవకలు జరిగాయని అన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ఈ పిటిషన్‌పై విచారణనను అక్టోబర్ 3కు చేపట్టనున్నట్టు తెలిపారు. అలాగే తగిన బెంచ్ కేటాయిస్తానని కూడా చెప్పారు. మొత్తంగా బుధవారం నాటి విచారణలో చంద్రబాబు నాయుడుకు ఎలాంటి ఊరట లభించలేదు. గురువారం నుంచి సోమవారం వరకు వరుసగా 5 రోజుల పాటు సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నందున మంగళవారం కోర్టు కార్యాకలాపాలు ప్రారంభమవుతాయి. అదే రోజు చంద్రబాబు కేసు విచారణకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement