కశ్మీర్ పండిట్లు అదృశ్యమవుతున్నారు..వారి సంఖ్య తగ్గిందని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం..పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల ప్రజలు కశ్మీరీల కోసం వెతకాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మేం చిన్న వయస్సులో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో కాశ్మీరీ పండిట్లు ఉన్నారు. కానీ ఈ రోజు నా పిల్లలు కాశ్మీరీ పండిట్లు అంటే ఎవరు.. వారు ఎలా కనిపిస్తారు అని నన్నుఅడుగుతున్నారు. ఎందుకంటే వారు అదృశ్యమవుతున్నారు. వారి సంఖ్య తగ్గింది. అలాగే మేము కూడా దృఢంగా నిలబడలేకపోతే.. మా ఉనికిని కోల్పోయే అవకాశం ఉందన్నారు. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ ముఖ్యమంత్రి.. నేడు రైతుల నుండి భూములను , ఉద్యోగాలు లాక్కుంటున్నారని ఆరోపించారు. రాళ్లు రువ్వకపోయినా, షట్ డౌన్ పాటించకపోయినా ఇక్కడ 10 లక్షల మంది సైనికులు ఉన్నారన్నారు.
ఇటీవల మదర్సాపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె బీజేపీ తీవ్రంగా మండిపడ్డారు. ఒక పోటీ జరుగుతోంది.. గుజరాత్ మోడల్‌ను అమలు చేయాలనుకుంటున్నారా.. ఉత్తరప్రదేశ్ మోడల్‌ను అమలు చేయాలనుకుంటున్నారా? లేక పోలరైజేషన్ రాజకీయాల్లో అసోం సీఎం రెండడుగులు ముందుకు సాగాలనుకుంటున్నారా?. ఈ దేశపు మూలాలను కదిలించేలా మాట్లాడుతున్నారు. రాజ్యాంగం ఇప్పుడు ఉన్న ప్రజల నుంచి వేరు చేయబడుతోందన్నారు. దేశాన్ని గుజరాత్, ఉత్తరప్రదేశ్, అసోం, మధ్యప్రదేశ్ మోడల్‌లుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె మండిపడ్డారు.