న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ధాన్యం కొనుగోళ్ల కారణంగా దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా రైతులకు దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల మేర లబ్ది జరిగిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ జారీ చేసిన ఓ ప్రకటనలో 2022-23 ఖరీఫ్ పంట కాలంలో జరిగిన ధాన్యం సేకరణ వల్ల దేశంలో కోటి మందికి పైగా రైతులు ప్రయోజనం పొందారని తెలిపింది. మార్చి 1 వరకు సుమారు 713 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం రూ. 1,46,960 కోట్లు కనీస మద్దతు ధర రూపంలో నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసిందని వెల్లడించింది. కొనుగోళ్ల ప్రక్రియలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు- చేశామని, సేకరించిన ధాన్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అన్ని రాష్ట్రాల్రకు పంపిణీ కూడా చేస్తున్నామని తెలిపింది.
ఇప్పటి వరకు సేకరించిన 713 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వల్లో సెంట్రల్ పూల్‌లో 246 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు చేరాయని వెల్లడించింది. ప్రస్తుతం దేశ అవసరాలకు సరిపడా బియ్యం నిల్వలు సెంట్రల్ పూల్ లో అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.ప్రస్తుత 2022-23 ఖరీఫ్ పంట పంట కాలంలో సుమారు 766 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం (బియ్యం రూపంలో 514 లక్షల మెట్రిక్ టన్నులు) సేకరణ జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఖరీఫ్ పంట కాలంలో జరిగిన సేకరణకు 2022-23 రబీ పంట కాలంలో జరిగిన 158 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణను కలిపితే మొత్తం ధాన్యం సేకరణ సుమారు 900 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.