కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మొన్నటిదాకా ఎవరూ ముందుకు రాని వారు.. ఇప్పుడు ఒక్కొక్కరుగా తామంటే తాము అని రేసులో నిలుస్తున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్ కాంగ్రెస్‌లో ఏర్పడ్డ సంక్షోభంతో పోటీలో ఉండాలనుకున్న అశోక్ గెహ్లోట్ రేసు నుంచి తప్పుకున్నట్టు అయ్యింది. ఇక.. ఇప్పటికైతే సీనియర్ లీడర్లు శశిథరూర్, మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ పేర్లు వినిపిస్తున్నాయి.
అయితే.. తాజాగా ఈ రేసులో ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇవ్వాల (బుధవారం) రాత్రికి ఆయన ఢిల్లీ వెళ్లనున్నారని, సెప్టెంబర్ 30న నామినేషన్ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది. రాజస్థాన్ కాంగ్రెస్‌లో తిరుగుబాటు తర్వాత అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ చీఫ్ పదవికి పోటీ చేయడంపై ప్రశ్నార్థకం ఏర్పడింది. ఆ తర్వాత దిగ్విజయ సింగ్, కెసి వేణుగోపాల్, మల్లికార్జున్ ఖర్గే పేర్లు తెరమీదికి వచ్చాయి. ఇక.. అక్టోబరు 17న జరగనున్న ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల కోసం కేంద్ర మాజీ మంత్రి, నెహ్రూ-గాంధీ కుటుంబానికి విధేయుడైన ఖర్గే వంటి నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయకూడదన్న నిర్ణయానికి రాహుల్ గాంధీ కట్టుబడి ఉన్నారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండో సారి ఓడిపోయిన తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కాగా, తాత్కాలిక అధ్యక్షురాలిగా మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టిన సోనియా గాంధీ, G-23గా పేర్కొంటున్న పార్టీలోని ఒక వర్గం లీడర్ల బహిరంగ తిరుగుబాటు తర్వాత 2020 ఆగస్టులో తాను కూడా ఆ పదవి నుంచి తప్పుకోవాలని భావించారు.
అయితే CWC ఆమెను కొనసాగించాలని కోరింది. ఇక మీదట గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత వహించబోదని అటు సోనియా, ఇటు రాహుల్ గాంధీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ నుంచి కానీ, ఇతర పార్టీల నుంచి కానీ వచ్చే విమర్శలను ఎదుర్కోవాలంటే గాంధీయేతరులే పార్టీని నడిపించాలని వారి ఆలోచనగా ఉంది.