Friday, November 22, 2024

ఫీచర్‌ ఫోన్స్ తో డిజిటల్‌ పేమెంట్స్‌.. యూపీఐ123పీఏఐ లాంచ్‌.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ మంగళవారం కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు కేవలం స్మార్ట్‌ఫోన్‌ల ద్వారానే లావాదేవీలకు అవకాశం ఉండేది. కానీ కొత్తగా తీసుకొచ్చిన సర్వీస్‌తో.. ఫీచర్‌ ఫోన్స్‌లో కూడా లావాదేవీలు నిర్వహించుకోవచ్చని శక్తికాంత్‌ దాస్‌ వెల్లడించారు. ఫీచర్స్‌ ఫోన్స్‌ కోసం సరికొత్త యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. యూపీఐ123పీఏఐ పేరుతో లాంచ్‌ చేసినట్టు వివరించారు. దేశ వ్యాప్తంగా ఉన్న 40 కోట్ల ఫీచర్‌ ఫోన్స్‌లో సరికొత్త పేమెంట్‌ సర్వీస్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. దీనికితోడు డిజిటల్‌ పేమెంట్లకు సంబంధించి కొత్త హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశామన్నారు. దీంతో బ్యాంకింగ్‌ సేవలు మరింత సులభంగా పొందే అవకాశాలు ఉన్నాయని ప్రకటించారు.

14431 హెల్ప్ లైన్‌ నెంబర్‌..

డిజిటల్‌ పేమెంట్స్‌కు సంబంధించి 24 గంటల హెల్ప్‌లైన్‌ డిజిసాథి సర్వీస్‌ను కూడా ఆవిష్కరించినట్టు వివరించారు. 14431 లేదా 1800891 3333 నెంబర్ల ద్వారా డిజిటల్‌ పేమెంట్లకు సంబంధించిన సేవలను పొందొచ్చు అని ప్రకటించారు. ఈ సర్వీసును ప్రతీ ఒక్కరు సద్వినియోగిం చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని ఆర్‌బీఐ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా యూపీఐ సేవల వినియోగం భారీగా పెరిగే అవకాశంఉందని శక్తికాంత్‌ దాస్‌ అభిప్రాయపడ్డారు. ఈ సేవలు డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పునకు సాక్ష్యంగా నిలుస్తుందని దాస్‌ తెలిపారు. యూపీఐ 123పే ద్వారా సదరు ఫీచర్‌ బ్యాంకు ఖాతాదారులు దాదాపు అన్ని రకాల యూపీఐ సేవలు పొందొచ్చు అని వివరించారు. స్కాన్‌ అండ్‌ పే సర్వీసులు మాత్రం అందుబాటులో ఉండవన్నారు. ఆయా లావాదేవీలను ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేకుండా చేయవచ్చని ప్రకటించారు. ఈ ఫీచర్‌ను పొందడానికి సదరు బ్యాంకు ఖాతాదారులు వారి బ్యాంక్‌ అకౌంట్‌ను ఫీచర్‌ ఫోన్‌తో లింక్‌ చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు.

నెల రోజుల్లో రూ.8.26 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్‌..

యూపీఐ ద్వారా 2022, ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో ట్రాన్సాక్షన్స్‌ జరిగినట్టు వివరించారు. నెల రోజుల్లో.. 453 కోట్ల లావాదేవీలు జరిగాయని, వీటి విలువ సుమారు రూ.8.26 లక్షల కోట్లు ఉంటుందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ ప్రకటించారు. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే.. రెట్టింపు స్థాయిలో యూపీఐ లావాదేవీలు జరిగినట్టు వివరించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ లావాదేవీల విలువ రూ.41లక్షల కోట్లు అని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.76లక్షల కోట్ల లావాదేవీలు యూపీఐ పేమెంట్‌ సర్వీస్‌ ద్వారా జరిగినట్టు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి కచ్చితంగా రూ.100 లక్షల కోట్లు విలువ చేసే లావాదేవీలకు చేరుతాయని ధీమా వ్యక్తం చేశారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. రెట్టింపు కంటే ఎక్కువే యూపీఐ లావాదేవీలు జరిగుతాయని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ చెప్పుకొచ్చారు.

- Advertisement -

రిజిస్ట్రేషన్‌ విధానం..

యూపీఐ123పే సేవ అనేది ఇంటర్‌నెట్‌ లేకుండానే.. వినియోగదారులు కేవలం త్రీ స్టెప్స్‌లో పొందొచ్చని దాస్‌ వివరించారు. ఇంటర్‌నెట్‌ లేని ఫోన్లు వాడుతున్న వారి సంఖ్య దేశ వ్యాప్తంగా 40కోట్ల వరకు ఉంటుందని వివరించారు. బ్యాంకులో నమోదైన రిజిస్టర్‌ సెల్‌ ఫోన్‌ నెంబర్‌ నుంచి స్టార్‌99యాష్‌ డయల్‌ చేసి బ్యాంక్‌ ఖాతాను ఎంచుకోవాలని, డెబిట్‌ కార్డులోని చివరి 6 అంకెలను ఎంటర్‌ చేయాలని సూచించారు. ఎక్స్‌పైరీ తేదీ, యూపీఐ పిన్‌ ఎంటర్‌ చేసి ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి.

లావాదేవీలు ఇలా..

  • నగదు బదలీ చేసేందుకు కొన్ని ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. ముందుగా రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌ నుంచి స్టార్‌99యాష్‌ అని డయల్‌ చేయాలి. అప్పుడు స్క్రీన్‌పైన మై ప్రొఫైల్‌, సెండ్‌ మనీ, రిసీవ్‌ మనీ, పెండింగ్‌ రిక్వెస్ట్‌, చెక్‌ బ్యాలెన్స్‌, యూపీఐ పిన్‌, ట్రాన్సాక్షన్స్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తాయి.
  • ఒక్కో ఆప్షన్‌కు ఒక్కో నెంబర్‌ను సూచిస్తుంది. డబ్బులు పంపాలంటే.. డయల్‌ ప్యాడ్‌లో 1ని ప్రెస్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఏ ఆప్షన్‌ ద్వారా అయితే డబ్బు పంపించాలో సెలెక్ట్‌ చేసుకోవాలి.
  • మొబైల్‌ నెంబర్‌ అయితే 1, యూపీఐ ఐడీ అయితే 3, సేవ్‌ చేసిన లబ్దిదారుని కోసం 4, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ కోసం 5 క్లిక్‌ చేయాల్సి ఉంటుంది.
  • ఎవరికి అయితే డబ్బులు పంపించాలని అనుకుంటున్నారో.. వారి ఫోన్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయాలి. వారి వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటిని ధ్రువీకరించుకున్న తరువాతే ముందుకు సాగాలి.
  • వివరాలు సరైనవే అయితే.. పంపించాలని అనుకుంటున్న మొత్తాన్ని ఎంటర్‌ చేయాలి. తరువాత మీ ట్రాన్సాక్షన్‌కు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. అన్నీ సరైతే.. యూపీఐ పిన్‌ ఎంటర్‌ చేయాలి.
  • అప్పుడు డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ అవుతాయి. విజయవంతం అయితే.. ఫోన్‌ నెంబర్‌కు మెసేజ్‌ వస్తుంది. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రకారం.. స్టార్‌99యాష్‌ సేవ ద్వారా నగదు బదిలీ చేసుకోవడంతో పాటు బ్యాలెన్స్‌ ఎంక్వైరీ, యూపీఐ పిన్‌ సెట్‌ చేయడం, మార్చడం వంటి ఇతర సేవలు ఉపయోగించుకోవచ్చు.
  • ఈ సర్వీస్‌ను ప్రస్తుతం 41 ప్రముఖ బ్యాంకులు, అన్ని జీఎస్‌ఎం సర్వీస్‌ ప్రొవైడర్లు హిందీ, ఆంగ్లంతో కలిపి 12 విభిన్న భాషల్లో అందిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement