Monday, November 18, 2024

తవ్వుకో అమ్ముకో.. మట్టి మాఫియాకి అండగా ఉన్నదెవరు?

సిద్దిపేట జిల్లాలోని చేర్యాల మండంలో అక్రమ మట్టి తరంలింపు యథేచ్ఛగా సాగుతోంది. పట్టణంలోని తూర్పు గుంటూరుపల్లి పరిధిలోని వ్యవసాయ భూముల నుండి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్నారు. 12 టైర్ల భారీ వాహనాలతో మట్టిని తరలించడంతో సబ్ స్టేషన్ నుండి తూర్పు గుంటూరు పల్లి వరకు ఉన్న బీటీ రోడ్డు డ్యామేజీ అవుతోంది.

చేర్యాల, ప్రభన్యూస్​ :  చేర్యాలలో మట్టి మాఫియా ఆగడాలకు అంతులేకుండా పోతోంది. పెద్ద పెద్ద లారీలతో మట్టి తరలిస్తూ స్థానికంగా ఇబ్బందులు సృష్టిస్తున్నారు. లారీల రాకపోకలతో రోడ్లు దెబ్బతింటున్నాయి. దీంతో అనేక మంది ద్విచక్ర వాహనాలపై నుండి పడి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇవ్వాల (ఆదివారం) ఉదయం మట్టి తరలిస్తుండగా స్థానిక రైతులు అడ్డుకొని రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో  అక్కడికి చేరుకున్న స్థానిక వీఆర్వో మురళి, వీఆర్ఏలు కరుణాకర్, వెంకటేష్ ఉన్నతాధికారుల అధికారుల ఆదేశాల మేరకు అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్లను, హిటాచీని సీజ్ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు.  

మట్టి మాఫియా వెనుక ఉన్నదెవరు?

- Advertisement -

చేర్యాల మండలంలో అక్రమంగా మట్టి తరలింపు వెనుక ఉన్నదెవరు అనే విషయంపై పట్టణంలో చర్చ జరుగుతోంది. బడా నాయకుల ప్రమేయం లేనిదే మట్టి తరలింపు సాధ్యం కాదని అంతా చర్చించుకుంటున్నారు. కాగా, మట్టి ఎవరికి తోలుతున్నారనేదానిపై స్థానిక రైతులు మట్టి తరలింపు దారులను అడగగా నూతనంగా మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన డ్రైనేజి కాలువల పక్కన పోసేందుకు తరలిస్తున్నట్టు చెప్పారు. దీంతో మున్సిపల్ కమిషనర్ రాజేంద్రకుమార్ ని వివరణ కోరగా మున్సిపాలిటీకి ఎవరూ మట్టి తోలడం లేదని, ,ఎవరైనా అక్రమంగా మట్టి తరలిస్తూ మున్సిపాలిటీ పేరు చెబితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.

మట్టి తవ్వకానికి అనుమతులు లేవు:ఎమ్మార్వో షేక్ ఆరిఫా బేగం

చేర్యాల మండలంలో మట్టి తరలింపునకు ఎవరికి ఎలాంటి అనుమతులు లేవని, ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా మట్టి తరలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో అరిఫా బేగం అన్నారు. అక్రమంగా మట్టి తరలిస్తున్నట్టు తెలిస్తే తమ దృష్టికి తీసుకు వస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement