హైదరాబాద్, ఆంధ్రప్రభ : స్వల్ప జాప్యం జరిగినా సరే అంతిమంగా నిరుద్యోగులకు లబ్ది జరగాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యోగ భర్తీ ప్రక్రియ ముందుకు సాగుతున్నది. ఎవరెన్ని విమర్శలు చేసినా ఒక్కో నోటిఫికేషన్‌కు నడుమ సమయమిస్తూ అన్ని ఉద్యోగాలకు అందరూ దరఖాస్తు చేసుకొని అవకాశాలు విస్తృతం చేసుకునేలా పకడ్బందీ వ్యూహంతో కార్యాచరణ చేస్తున్నారు. ఈ దిశలో ఇప్పటికే పలు ఉత్తర్వులు, మినహాయింపులు, వెసులుబాట్లకు చెందిన ఉత్తర్వులను సీఎం కేసీఆర్ ప్రకటించినట్లుగానే ప్రభుత్వం జీవోలను జారీ చేసింది. దీంతో ఉద్యోగ పండుగ ప్రక్రియ ఊపందుకున్నట్లయింది. సీఎం కేసీఆర్ అధికారిక ప్రకటనతో శాఖల వారీగా ముమ్మర కసరత్తు మొదలైంది.
ఖాళీల గుర్తింపు ప్రక్రియ ముగియడంతో మరింత వేగవంతంగా ప్రజలకు పారదర్శక ప్రభుత్వ పాలన అందజేత దిశగా సర్కార్ నోటిఫికేషన్ల జారీకి అడ్డంకులు లేని రీతిలో అన్ని ఏర్పాట్లూ చకచకా చేస్తోంది. ఒక్కో నియామక సంస్థ ఒక్కో సమయంలో వేర్వేరు నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు నిజమైన ఉద్యోగ పండుగగా అవకాశం విస్తృతం చేసేలా కార్యాచరణ ముగింపుకు చేరింది. ఇక వెంటనే నోటిఫికేషన్ల జారీతో నిరుద్యోగులను ఉద్యోగులుగా గుర్తించే సన్నాహాలు తుది దశకు చేరాయి. తొలి విడతలో 30,453 పోస్టుల భర్తీకి అనుమతిఉలు జారీ చేసిన ఆర్ధిక శాఖ బుధవారం మరో 3334 పోస్టులకు అనుమతించింది. సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లుగా వయో పరిమితి పెంపు ఉత్తర్వులను విడుదల చేసింది. ఇప్పటికే 25లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వం వద్ద రిజిస్టరై ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వయో పరిమితి పెంపు నేపథ్యంలో ఈ సంఖ్య పెరగనుంది. పోలీస్ శాఖ వంటి యూనిఫాం సర్వీసెస్‌లకు కూడా మూడేళ్ల వయో పరిమితి పెంపుకు ఉత్తర్వులు విడుదలయ్యాయి.
ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని పదేళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తద్వారా ఓసీలకు 44ఏళ్లకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49ఏళ్లకు, దివ్యాంగులకు 54ఏళ్లకు ఉద్యోగ గరిష్ట వయోపరిమితి పెెరిగింది. నిరుద్యోగులకు ఇబ్బందులు లేకుండా, ఎక్కువ ఉద్యోగాలకు పోటీ పడేలా వారికి అవకాశం కల్పిస్తూ సర్కార్ కీలక చర్యలు తీసుకుంటున్నది. 80,039 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ల జారీపై తీవ్రంగా శ్రమిస్తున్నది. ఆర్ధిక శాఖ ఇప్పటికే వాఖల వారీగా వివరాలను రెడీ చేస్తున్నది. వేర్వేరు నియామక సంస్థలతో వీలైనన్ని నోటిఫికేషన్లు జారీ చేసి ఒక్కో నోటిఫికేషన్‌కు మధ్య గడువు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో న్యాయపరమైన అవరోధాలను అధిగమించేందుకు ప్రభుత్వం ఉన్నతాధికారులతో ఇప్పటికే కీలక చర్చలు జరిపి అవసరమైన చర్యలు తీసుకొంది. టీఎస్‌పీఎస్సీకి చెందిన 23వేల పోస్టుల వివాదాలపై కూడా దృష్టి పెట్టింది.
కొత్త జిల్లాలు, జోన్ల వారీగా నోటిఫికేషన్ల జారీకి శ్రీకారం చుట్టనున్నారు. అయితే తొలుత ఖాళీలను పూరించి, ఆ తర్వాత జిల్లాల వారీగా క్యాడర్‌స్ట్రెంగ్త్‌ను నిర్ధారించనున్నారని, అప్పుడు ఏర్పడే ఖాళీలను రెండో దశలో భర్తీ చేయాలని ప్రభుత్వ వ్యూహంగా ఉందని తెలుస్తోంది. 27శాఖలకు చెందిన ఉద్యోగాలను జిల్లా, జోనల్, మల్టిd జోనల్ విధానంలో కేటాయింపులు పూర్తి చేసిన ప్రభుత్వం ప్రత్యేక నియామక మండళ్లతో నోటిఫికేషన్లను జారీ చేయనుంది. జిల్లా స్థాయి పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్లు చైర్మన్లుగా కమిటీలను ఏర్పాటు చేశారు. వీరిద్వారా జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసి నియామక ప్రక్రియ ముగించనున్నారు.
వీలైనంత తొందర్లో 80,039 పోస్టుల భర్తీకి వీలుగా శాఖల వారీగా నోటిఫై చేసే కార్యాచరణ చురుగ్గా కొనసాగుతోంది. ఆ తర్వాత జీవోలను జారీ చేయనున్నారు. ఈ మేరకు ఆర్ధిక శాఖ అన్ని నియామకాలకు ఆమోదం ఇవ్వనుంది. దీంతో ఆర్ధికపరమైన ఇబ్బందులు తొలగిపోనున్నాయి. సర్వీస్ నిబంధనల మేరకు నూతన రోస్టర్ పాయింట్లతో రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఒకే సిలబస్ ఉన్న పోస్టులకు ఒకే నోటిఫికేషన్ పరిధిలో నియామకాలు చేసేందుకు ఉన్న అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఇక వడివడిగా అన్ని శాఖలు, విభాగాలు, జిల్లాల ఖాళీల భర్తీకి నేరుగా పర్యవేక్షణకు సీఎస్ నేతృత్వంలో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు అవుతోంది. ఈ కమిటీలో ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా ఉండి, సమావేశాలద్వారా నియామక పరిస్థితులను పర్యవేక్షిస్తారు. కిందిస్థాయిలో పోస్టుల భర్తీకి రాతపరీక్షలను నిర్వహించనుండగా, ఉన్నతస్థాయి పోస్టులకు ఇంటర్వ్యూలను కరద్దు చేసిన ప్రభుత్వం ఉత్తర్వులు కూడా విడుదల చేసింది. ఇలా జిల్లా స్థాయి పోస్టులు 39,829 పోస్టులను కలెక్టర్లు ఏ జిల్లాకు ఆ జిల్లాలో నోటిఫికేషన్లు వేసి భర్తీ ప్రక్రియ చేపడుతారు.
సీఎం కేసీఆర్ శాఖల వారీగా ప్రకటించిన పోస్టులకు సంబంధిత శాఖలు నోటిఫై చేసే కార్యక్రమం ఊపందుకుంది. నియామక సంస్థలకు వివరాలను అందించాలన్న సీఎస్ ఆదేశాలతో అన్ని శాఖలు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. జీవోల జారీకీ సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక శాఖ ఉద్యోగ భర్తీకి ఆమోదం తెలపడంతోపాటు, మొత్తం నియామకాలతో పడే ఆర్థిక భారంపై సర్కార్‌కు నివేదిక అందజేసింది.
భారీగా గ్రూప్-1 పోస్టుల భర్తీ…
తెలంగాణ తొలి గ్రూప్ -1కు రంగం సిద్ధమైంది. ఈ దఫా గ్రూప్-1లో 503 పోస్టులను భర్తీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్రంలో 2011 ఉద్యోగ ప్రకటనలో ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన వారికి టీఎస్‌పీఎస్సీ మెయిన్స్, ఇంటర్య్వూలు నిర్వహించి 128 నియామకాలు పూర్తి చేసింది. 2018లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్ కార్యాచరణ చేపట్టినా, అది ఆచరణలోకి రాలేదు. ఆ తర్వాత ఇప్పుడే ఇంతటి భారీ నోటిఫికేషన్‌తో భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో ఆర్డీవో, డీఎస్పీ పోస్టులే ఎక్కువగా ఉన్నాయి. అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ఇంటర్య్వూలను రద్దు చేసిన ప్రభుత్వం ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయనుంది.
శాఖల వారీగా ఖాళీలు…
శాఖ ఖాళీలు
హోం 18334
సెకండరీ ఎడ్యుకేషన్ 13086
వైద్య ఆరోగ్య శాఖ 12755
ఉన్నత విద్య 7878
బీసీ సంక్షేమం 4311
రెవెన్యూ 3560
ఎస్సీ అభివృద్ధి శాఖ 2879
ఇరిగేషన్ 2692
గిరిజన సంక్షేమం 2399
మైనారిటీ సంక్షేమం 1825
అటవీ, పర్యావరణం 1598
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి 1455
కార్మిక, ఉపాధి కల్పన 1221
ఆర్థిక 1146
స్త్రీ, శిశు సంక్షేమం 895
మునిసిపల్, పట్టణాభివృద్ధి 859
వ్యవసాయ, సహకార 801
రవాణా, రోడ్లు-భవనాలు 563
న్యాయశాఖ 386
పశు పోషణ, మత్స్య 353
సాధారణ పరిపాలన 343
పరిశ్రమలు, వాణిజ్యం 233
యువజన, పర్యాటక, సాంస్కృతిక 184
ప్రణాళిక 136
ఆహార, పౌర సరఫరాలు 106
లెజిస్లేచర్ 25
===============
మొత్తం 80,039
===============
గ్రూప్‌ల వారీగా ఖాళీల వివరాలు…
గ్రూప్-1 503
గ్రూప్-2 582
గ్రూప్-3 1,373
గ్రూప్-4 9,168