హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : హైదరాబాద్‌లోని కేంద్ర రక్షణ సంస్థ (డీఆర్డీఎల్)లో పని చేసే ఉద్యోగులను పాకిస్థానీ అమ్మాయిలు ట్రాప్ చేస్తున్నారు. కంచన్‌బాగ్ డీఆర్డీఎల్లో తాజాగా బయట పడిన హనీ ట్రాప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డీఆర్డీఎల్ క్వాలిటీ విభాగంలో ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న మల్లికార్జున్‌రెడ్డిని నటాషా అనే మహిళ ముగ్గులోకి దింపి భారత్ అణు రహస్యాలను తెలుసుకున్నట్టు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న రాచకొండ పోలీసులు గుర్తించారు. ఇప్పటికే హనీ ట్రాప్ విషయంలో మల్లికార్జున్‌రెడ్డిని రాచకొండ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తవ్వే కొద్దీ కీలకాంశాలు వెలుగు చూస్తున్నాయి.
డీఆర్డీఎల్లో పని చేస్తున్న మల్లికార్జున్‌రెడ్డిని పాకిస్థాన్‌కు చెందిన నటాషా అనే మహిళ మాయ మాటలు చెప్పి ముగ్గులోకి దింపి మన దేశ అణు రహస్యాలను సేకరించినట్టు పోలీసులు గుర్తించారు. ప్రధానంగా కె.సిరీస్ మిసైల్‌కు చెందిన కీలక సమాచారాన్ని మల్లికార్జున్‌రెడ్డి నటాషాకు చేరవేసినట్టు పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో బయటపడినట్టు తెలుస్తోంది. యూకే అనుబంధ రక్షణ శాఖలో జర్నలిస్టుగా పని చేస్తున్నానని నమ్మబలికిన నటాషా మల్లికార్జున్‌రెడ్డికి మాటలు చెప్పి తనవైపు తిప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే నటాషా నిజంగా జర్నలిస్టు కాదని పాకిస్థాన్ ఇంటర్ సర్వీస్ ఇంటలిజెన్స్ (ఐఎస్ఐ) ఏజెంట్‌గా వ్యవహరిస్తోందని రాచకొండ పోలీసులు అనుమానిస్తున్నారు.
గత రెండేళ్లుగా వీరిద్దరి మధ్య వరుస సంభాషణలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. అయితే 2019వ సంవత్సరం నుంచి 2021 వరకు నటాషాకు మిసైల్‌లో ఉపయోగించే కాంపోనెంట్స్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని మల్లికార్జున్‌రెడ్డి చేరవేసినట్టు పోలీసులు గుర్తించారు. సబ్ మెరైన్ నుండి మిసైల్స్‌ను ప్రయోగించే వరకు కీలకమైన కె.సిరీస్ కోడ్‌ను మల్లికార్జున్‌రెడ్డి ఐఎస్ఐ ఏజెంట్ నటాషాకు సమాచారం అందించారు. సిమ్రాన్, చోప్రా, ఒమీషా అడ్డి పేరుతో నకిలీ ఫేస్బుక్ ప్రొఫైల్స్ మెయింటనెన్స్‌ను చేసినట్టు తెలుస్తోంది. పాకిస్థానీ ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా మల్లికార్జున్‌కు నటాషా మెసెజ్‌లు పంపించినట్టు పోలీసులు గుర్తించారు.
అయితే మల్లికార్జున్‌రెడ్డి ఫోటోలు, వీడియోలు పంపించమని అనేకమార్లు నటాషాను అడిగినా స్పందించలేదని సమాచారం. కేవలం చాటింగ్‌తోనే మల్లికార్జున్‌ను ట్రాప్ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లో మిసైల్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొబైల్లో నటాషా వాయిస్ రికార్డింగ్‌లను గుర్తించిన పోలీసులు ఆమె ఎలా మాట్లాడింది, మాట్లాడిన దాంట్లో ఏయే అంశాలు చోటు చేసుకున్నాయి అన్న అంశాన్ని తెలుసుకునేందుకు రాచకొండ పోలీసులు ఈ సమాచారాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కు పంపించినట్టు సమాచారం. మొబైల్లో నటాషా వాయిస్ రికార్డులను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇంగ్లీష్, హీందీ భాషల్లో నటాషా వాయిస్ క్లిప్పింగ్‌లు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే మల్లికార్జున్‌రెడ్డిని అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు అతనిని కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
మల్లికార్జున్‌రెడ్డిపై ఆరా తీస్తున్న పోలీసులు
మల్లికార్జున్‌రెడ్డి పూర్వాపరాలను విచారించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఆయన ఎక్కడ పుట్టింది, ఎక్కడ చదివింది, గతంలో ఆయన కార్యకలాపాలేంటి, ఎవరితో సంబంధాలు ఉన్నాయి, కేవలం నటాషాతోనే కీలక సమాచారాన్ని పంచుకున్నారా, ఇంకెవరితోనైనా మాట్లాడారా అనే అంశంపై కూపీ లాగే పనిలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. రెండేళ్లుగా సామాజిక మాధ్యమాల ద్వారా నటాషాతో మాట్లాడినపుడు డీఆర్డీఎల్లో పని చేసే శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఈ విషయాన్ని ఎందుకు పసిగట్టలేకపోయారు అనే అంశంపై పోలీసులు శోధిస్తున్నట్టు సమాచారం. మిసైల్స్‌కు సంబంధించిన కీలక సమాచారం శత్రు దేశమైన పాకిస్థాన్‌కు చేరవేయడం ద్వారా దేశానికి పొంచిన ముప్పుపై డీఆర్డీఎల్ శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
సాధారణంగా డీఆర్డీఎల్లో పని చేసే చిరు ఉద్యోగి మొదలుకొని ఉన్నత స్థాయి అధికారి కదలికలు, వారి వ్యక్తిగత వ్యవహారాలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి ఉన్నత స్థాయి అధికారులకు చేరవేసే ఆనవాయితీ ఉంది. మల్లికార్జున్‌రెడ్డి క్వాలిటీ ఇంజనీర్‌గా పని చేస్తూ మిసైల్‌లో ఉపయోగించే కాంపోనెంట్లను మొదలుకొని ఈ మిసైల్ ప్రయోగించే వరకు జరిగే కథా క్రమాన్ని నటాషాకు వివరించడం వెనక ఇంకెవరైనఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మల్లికార్జున్‌రెడ్డి వ్యవహారశైలిపై ఇటు డీఆర్డీఎల్ అధికారులు, అటు పోలీసులు ఆరా తీసే పనిలో పడ్డారు. మల్లికార్జున్‌రెడ్డి తరహాలో ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో విచారిస్తున్నట్టు సమాచారం.
డీఆర్డీఎల్లో పని చేస్తున్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్లలో మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఎంతో మంది ఉన్నారు. వీరిని ఎంపిక చేసే సమయంలో పూర్తి స్థాయిలో విచారణ జరపడంతో పాటు కేంద్ర నిఘా వర్గాలు, ప్రత్యేక నిఘా వర్గాలు సంబంధిత ఉద్యోగి, అధికారి నడవడిక, విద్యార్హతలు, ఆయన పుట్టింది మొదలుకొని ఉన్నత విద్యాభ్యాసం వరకు కీలక సమాచారాన్ని రాబట్టి తద్వారా నియామక పత్రాలను అందజేస్తారు. మరి మల్లికార్జున్‌రెడ్డి విషయంలో ఈ తరహా విచారణ జరిగిందా, లేదా అన్నది తేలాల్సి ఉంది.