లక్నో : పార్టీ టికెట్ దక్కలేదని మనస్తాపంతో సమాజ్‌వాదీ పార్టీ నేత ఆదిత్య ఠాకూర్ ఆత్మహత్యకు యత్నించాడు. లక్నోలోని సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయం ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకోవడానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అడ్డుకుని ఆయన్ని రక్షించారు. ఈ సందర్భంగా తనను కాదని.. బయటి వ్యక్తికి టికెట్ ఇచ్చారని ఆదిత్య ఠాకూర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రాణాలు తీసుకుంటానని.. తనకు న్యాయం చేయాలని ఆయన భావోద్వేగానికి గురయ్యాడు. ఈ సందర్భంగా అందరి ముందు వెక్కివెక్కి ఏడ్చాడు.
తాను పార్టీకి చేసిన సేవ గురించి చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యాడు. టికెట్ కోసం ఐదేళ్లుగా ఎదురు చూశానని, అప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు చేసుకున్నా అని చెప్పుకొచ్చాడు. ఐదేళ్లుగా ప్రజల మధ్యే ఉంటూ.. సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేశానని వివరించాడు. పెట్రోల్ కళ్లలోకి పోవడంతో.. ఠాకూర్ తీవ్ర ఇబ్బందికి గురయ్యాడు. బీఎస్‌పీలోనూ ఇలాంటి ఘటనే ముజఫర్‌నగర్‌లోని దార్తావాల్ స్థానానికి చోటు చేసుకుంది. టికెట్ రాకపోవడంతో.. బీఎస్‌పీ అభ్యర్థి అర్హద్ రానా బోరున విలపించాడు.