యూపీ మీరట్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. ధ్యాన్ చంద్ క్రీడావర్సిటీకి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. రూ.700కోట్లతో ధ్యాన్ చంద్ క్రీడా వర్సిటీ నిర్మాణం కానుంది. అనంతరం కాళీపల్తాన్ ఆలయాన్ని మోడీ దర్శించుకున్నారు. త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో అన్ని పార్టీలు ఈ ఎలక్షన్లపై దృష్టి సారించాయి. ఈ మేరకు ఎలాగైనా విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల సమరం మాములుగా లేదు. మళ్లీ ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్రలో విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు జరుపుతోంది. ఆయా కార్యక్రమాల్లో బీజేపీ అగ్రనేతలందరూ పాల్గొంటున్నారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రంలోని నేతలందరూ వరుస పెట్టి యూపీ పర్యటనలు చేస్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ సైతం ఉత్తరప్రదేశ్ లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఇందుకు ముందు కొనసాగిన ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ సవాలు విసురుతూ.. బలంగా నిలబడుతున్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని ప్రధాని ప్రధానంగా టార్గెట్ చేసి.. విమర్శలు చేశారు.ఒకప్పుడు నేరస్థులకు అడ్డాగా ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం క్రీడాకారులకు గడ్డగా మారుతున్నదని అన్నారు. నేరస్తులు మీరట్ పరిసర ప్రాంతాల్లో ‘అక్రమ స్వాధీన’ టోర్నీలు ఆడేవారని అన్నారు. నేరగాళ్ల భయంతో ప్రజలు పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సాయంత్రం దాటినా అక్కాచెల్లెళ్లు, కూతుళ్లు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉండేదన్నారు. రాష్ట్రంలో సీఎం యోగి నేతృత్వంలోని బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నేరగాళ్లను ‘జైలు’లో పెట్టి అడుకుంటున్నారని అన్నారు. యోగి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..