ఐపీఎల్ 41వ మ్యాచ్‌లో ఇవ్వాల (ఆదివారం) పంజాబ్‌కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోరు జరుగుతోంది. టాస్ గెలిచిన చెన్నై జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్లు కాన్వే 92, రుతురాజ్ (37) మంచి భాగస్వామ్యం ఇచ్చారు. ఆ తర్వాత శివం దూబే (28), మోయిన్ అలీ (10), రవీంద్ర జడేజా (12) పరుగులతో కాస్త పర్వాలేదు అనిపించినా.. కాన్వే మాత్రం ఒంటరిపోరాటం చేసి స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు.
ఇక చివరి ఓవర్లో జడేజా అవుట్ కావడంతో క్రీజులోకి కెప్టెన్ ధోనీ వచ్చాడు. అయితే.. జడేజా అవుట్ కాగానే స్టేడియంలో ఒక రకమైన సంబురం కనిపించింది. ధోనీ ఆటను చూడాలన్న కుతూహలంతో అభిమానులు పసుపురంగు జెండాలను ఎగరేస్తూ సందడి చేశారు. ఇక ధోనీ లాస్ట్ రెండు బాల్స్‌ని సిక్స్‌లుగా మలచడంతో చెన్నైలోని చిదంబరం స్టేడియం సమ్మక్క సారలమ్మ జాతరను తలపించింది. కేరింతలు, అరుపులు, కేకలతో ధోనీ ఆటను ఆస్వాదించారు అభిమానులు..
కాగా.. చెన్నై నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేయగా.. తదుపరి బరిలోకి దిగనున్న పంజాబ్ జట్టు 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది..