Sunday, November 24, 2024

ధర్మపురి బ్రాండ్​.. బియ్యం, నిత్యావసరాలు మార్కెట్​ చేద్దాం: మంత్రి కొప్పుల

త్వరలో ధర్మపురి బ్రాండ్‌ పేరుతో బియ్యం, ఇతర నిత్యవసర వస్తువులను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రకటించారు. శనివారం మేడ్చల్ మండలం ఘనపూర్ వద్ద మమత బ్రాండ్ పేరుతో మసాలాలు తయారు చేసే జవహర్ బ్రదర్స్, జీడిమెట్ల సుభాష్‌నగర్‌లో ప్రకృతి బ్రాండ్ పేరుతో హెర్బల్ ఉత్పత్తులను తయారు చేసే శ్రీయోగి ఇండస్ట్రీస్, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ను నియోజకవర్గానికి చెందిన 130 మంది మహిళలతో సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు మహిళలు ఆయా ఉత్పత్తుల తయారీ, యంత్రాలు, ప్యాకింగ్, మార్కెటింగ్ సౌకర్యాలను పరిశీలించారు. వాటికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలతో మంత్రి మాట్లాడారు. ధర్మపురి బ్రాండ్‌ పేరిట నాణ్యమైన సన్న బియ్యాన్ని మార్కెట్లోకి విడుదల చేద్దామని సూచించారు. ధర్మపురితో పాటు చుట్టుపక్కల సన్నవడ్లు సమృద్ధిగా పండుతున్నాయని, వాటిని పెద్ద ఎత్తున సేకరించి.. నాణ్యమైన బియ్యాన్ని మహిళా సంఘాల ద్వారా వినియోగదారులకు అందజేద్దామని మంత్రి సూచించారు.

అలాగే ముడి పసుపు, మిర్చి సైతం సేకరించి సహజ బ్రాండ్‌ పేరిట మార్కెటింగ్ చేయొచ్చని చెప్పుకొచ్చారు. ఇప్పటికే బ్రాండ్‌ పేరిట సబ్బులు, శానిటైజర్లు, అగర్‌బత్తీలు, పసుపు, మసాలాలు, పిండి వంటలు ఉత్పత్తి చేస్తూనే మార్కెటింగ్‌ చేస్తున్నామన్నారు. విజ్ఞానయాత్రలో వివిధ రకాల ఉత్పత్తుల తయారీ, కొద్దిపాటి స్థలంలో కూరగాయల సాగును పరిశీలించారని. వాటిపై సంపూర్ణ అవగాహన, సృజనాత్మకతతో ముందుకు సాగాలని సూచించారు మంత్రి కొప్పుల. కష్టపడితే ఫలితం ఉంటుందని, వినూత్న ఆలోచనలు, కార్యదీక్షతో ముందుకు సాగాలని మహిళలకు తెలియజేశారు.

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఆర్థికంగా ఎదిగేందుకు వేలాది మందికి ఉపాధి కల్పించేందుకు తన సహకారంతో పాటు ప్రభుత్వంతో చేయూత ఉంటుందన్నారు. మహిళలు తలచుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్​. సృజనాత్మక ఆలోచనలతో ముందుకు సాగానివ్వాలని, అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జగిత్యాల జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వినోద్, అసిస్టెంట్ డైరెక్టర్ సుధీర్,సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ సీఈవో అహ్మద్, పరిశ్రమల శాఖ మేడ్చల్‌ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, శ్రీయోగి ఇండస్ట్రీస్ వ్యవస్థాపకురాలు సుభద్రమ్మ, వంశీ, సుధాకర్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement