హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాజకీయ లబ్ధి కోసం అధికారులను పావుగా వాడుకోవడం తగదని డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం తనను బలవంతంగా సెలవుపై పంపిందంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను డీజీపీ మహేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం తగదని హితవు పలికారు. ఇంట్లో కింద పడటం వల్ల ఎడమ చేతి భుజానికి గాయమైంది. వైద్యులు పూర్తి విశ్రాంతి అవసరమని సూచించడంతో ఫిబ్రవరి 18 నుంచి మార్చి 4 వరకు సెలవు పెట్టడం జరిగిందన్నారు. వైద్యులు సూచించిన విధంగా ఫిజియోథెరపీతో పాటు మందులు వాడుతున్నట్లు తెలిపారు. వైద్యుల సలహా తీసుకొని తిరిగి విధుల్లో చేరతానని పేర్కొన్నారు. బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి ఇలా బాధ్యతారహిత ప్రచారంపట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ అధికారులను పావులుగా వాడుకోవడం తగదన్నారు. ఉన్నతస్థాయి హోదాలో ఉన్న సీనియర్ అధికారిపై ఈ తరహా ఆరోపణలు చేయడం మంచిది కాదని పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలు చేసి పోలీస్ శాఖ స్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగే ప్రమాదముందని డీజీపీ అభిప్రాయపడ్డారు. ఈ తరహా వ్యాఖ్యలు చేయకుండా సంయమనం పాటించాలని కోరుతున్నాను అని మహేందర్‌రెడ్డి వివరించారు.
అధికారులపై నేతల విమర్శలు సరికాదు.. ఖండించిన ఐపీఎస్ అధికారుల సంఘం
అఖిల భారత సర్వీస్ అధికారులు, ప్రత్యేకించి ఒక రాష్ట్రానికి చెందిన అధికారులను ఉద్దేశించి రాజకీయ నేతలు విమర్శలు చేయడాన్ని రాష్ట్ర ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల సంఘాలు వేర్వేరు ప్రకటనలలో ఖండించారు. రాష్ట్రానికి చెందిన కొంతమంది అధికారులను లక్ష్యంగా చేసుకొని.. విమర్శలు చేయడం కక్షపూరితమంటూ ఆ సంఘాలు ఆక్షేపించాయి. అధికారులు తమ విధులు సరిగా నిర్వహించకుండా జోక్యం చేసుకోవడమేనని ప్రచారం కోసం అనవసరంగా అధికారులపై చేసే ప్రకటనలు వారి పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అభిప్రాయపడింది. భవిష్యత్తులో అధికారులపై దురుద్దేశంతో కూడిన ప్రకటనలు చేయవద్దని రాజకీయ నేతలను కోరుతూ ఐఏఎస్, ఐపీఎస్‌ల అధికారుల సంఘాలు తీర్మానించాయి.