Friday, November 22, 2024

Exclusive | శ్రీ‌శైలానికి పోటెత్త‌నున్న భ‌క్తులు.. శ్రావ‌ణ మాసోత్స‌వాల‌కు ప్ర‌త్యేక ఏర్పాట్లు!

శ్రీశైలం మ‌ల్ల‌న్న స‌న్నిధిలో ఈ నెల 17వ తేదీ నుంచి వచ్చేనెల 19వ తేదీ వరకు శ్రావణ మాసోత్సవాలు నిర్వ‌హిస్తున్నారు. శ్రావణ మాసోత్సవాల సందర్భంగా భ్రమరాంబికా, మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకునేందుకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఈ అంచనాల మధ్య శ్రీశైలం దేవస్థానం అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా ఏర్పాట్లలో పురోగతిని దేవస్థానం ఈఓ ఎస్ లవన్న, ఇంజినీరింగ్, క్యూ కాంప్లెక్స్, పారిశుద్ధ్య విభాగం అధికారులు పరిశీలించారు. క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూ లైన్లు, అర్జిత సేవా క్యూ లైన్లు, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం క్యూ లైన్లు, విరాళాల సేకరణ కేంద్రం వద్ద వసతులను ఈవో లవన్న తదితరులు పరిశీలించారు.

శ్రావణ మాసంలో భక్తుల తాకిడిని ద్రుష్టిలో పెట్టుకుని ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఈఓ ఆదేశించారు. స్వామి వారి స్పర్శ దర్శనం, వివిధ ఆర్జిత సేవలకు వేర్వేరుగా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనాలకు కూడా వేర్వేరుగా క్యూలైన్లు పెడుతున్నారు.

సూచిక బోర్డుల ఏర్పాటు..
దర్శనం క్యూ లైన్లు, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం టికెట్ కౌంటర్లను భక్తులు ఈజీగా గుర్తించడానికి తగినన్ని సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఈఓ ఆదేశాలు జారీ చేశారు. క్యూ కాంప్లెక్స్ లోని మొత్తం కంపార్ట్ మెంట్లలో 12 కంపార్ట్ మెంట్లను ఉచిత దర్శనానికి ఉపయోగించాలన్నారు. అలాగే శీఘ్ర దర్శనం (రూ.150) కోసం ఆరు కంపార్ట్ మెంట్లు వాడాలని సూచించారు.

- Advertisement -

శుచీ శుభ్రతకు ప్రాధాన్యం..
క్యూ లైన్లలో శుచీ శుభ్రతకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి ఈఓ సూచించారు. ప్రత్యేకించి క్యూ కాంప్లెక్స్ లోని వాష్‌రూమ్‌ల‌ శుభ్రతను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. క్యూ కాంప్లెక్స్ లో మరో నాలుగు వాష్‌రూమ్‌ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. అన్ని వాష్ రూముల‌లో లైటింగ్ స‌రిగా పని చేసేలా నిరంతరం పర్యవేక్షించాలని ఎలక్ట్రికల్ విభాగం అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. క్యూ కాంప్లెక్స్‌లో మరిన్ని ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. క్యూ కాంప్లెక్స్ లోని భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం, బిస్కట్లు పంపిణీ చేస్తుండాలని అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

12 నుంచి పర్వదినాలు, సెలవుల్లో అభిషేకాలు నిలిపివేత
భక్తుల రద్దీ పెరుగనున్న నేపథ్యంలో ఈ నెల 12 నుంచి వచ్చే నెల 15 వరకు (శ్రావణ మాసం ముగిసే వరకూ) వచ్చే శని, ఆది, సోమవారాలు, పర్వదినాలు, స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15), వరలక్ష్మి వ్రతం (ఆగస్టు 25), శ్రావణ పౌర్ణమి (ఆగస్టు 31), శ్రీ క్రుష్ణాష్ణమి (సెప్టెంబర్ 6) పర్వ దినాల్లో శ్రీ స్వామి వారి గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు పూర్తిగా నిలిపివేశారు. అభిషేకాలు నిలిపేయడంతో ఈ నిర్దారిత రోజుల్లో రూ.500 ఫీజుతో శ్రీ స్వామి వార్ల స్పర్శ దర్శనానికి అనుమతి ఇచ్చారు. ప్రతి రోజూ నాలుగు విడతలుగా స్పర్శ దర్శనం కల్పిస్తారు. ప్రస్తుతం మాదిరిగానే భక్తులు స్పర్శ దర్శనం టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు ఆన్‌లైన్‌లోనే దేవస్థానం వెబ్‌సైట్ నుంచి పొందాలి. దేవస్థానం యాప్ నుంచి భక్తులు మరింత సులభతరంగా టికెట్లు పొందవచ్చు. టికెట్ల లభ్యతను బట్టి ఒక గంట ముందు వరకూ ఆన్ లైన్ లో భక్తులు ఆయా టికెట్లు పొందేందుకు వీలు కల్పిస్తున్నది దేవస్థానం.

ఆన్ లైన్ టికెట్ తోపాటు ఆధార్ ప్రతి ఉంటేనే అనుమతి
ఆర్జిత సేవ, స్పర్శ దర్శనం టికెట్లు పొందిన వారు విధిగా ఆన్ లైన్ టికెట్ ప్రింట్ కాపీ వెంట తెచ్చుకోవాలి. ఆన్ లైన్ ద్వారా పొందిన టికెట్లు స్కాన్ చేసిన తర్వాతే ఆర్జిత సేవాకర్తలు, స్పర్శ దర్శనం టికెట్లు పొందిన వారికి అనుమతి ఇస్తారు. ఆర్జిత సేవాకర్తలు, స్పర్శ దర్శనం టికెట్లు తీసుకున్న వారు ఆధార్ కార్డు గుర్తింపు ప్రతి (ఒరిజినల్ లేదా జిరాక్స్ కాపీ) తేవాల్సి ఉంటుంది. ఆధార్ గుర్తింపు ప్రకారమే ఆర్జిత సేవాకర్తలు, స్పర్శ దర్శనం టికెట్లు పొందిన వారిని అనుమతిస్తారు. కనుక భక్తులు టికెట్ ప్రింట్ కాపీ, ఆధార్ కార్డు ఒరిజినల్ తోపాటు ఆధార్ జీరాక్స్ కాపీ తెచ్చుకోవాలి.

ఆ నాలుగు రోజుల్లో ఉచిత స్పర్శ దర్శనం యథాతథం
ఈ నిర్దిష్ట రోజులు మినహా తక్కిన రోజుల్లో మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి కల్పిస్తున్న ఉచిత స్పర్శ దర్శనం యథావిధిగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వీ రామక్రుష్ణ, సహాయ కార్య నిర్వహణాధికారి ఐఎన్వీ మోహన్, సూపర్ వైజర్ మధుసూధన్ రెడ్డి, హిమబిందు, అయ్యన్న, నాగరాజు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఐ/సీ) చంద్రశేఖర శాస్త్రి, ఎలక్ట్రికల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఐ/సీ) పీవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement