తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుంటే రాజకీయ పార్టీలు మాత్రం మునిసిపల్ ఎన్నికలపై దృష్టిపెట్టాయి. కరోనా విపరీతంగా విజృంభస్తున్న నేపథ్యంలోనే ఎన్నికలు జరుగుతన్న ప్రాంతాల్లో కొవిడ్ నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. కోవిడ్ కష్టకాలంలోనూ అధికార, విపక్షాలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు సహా.. ఐదు మున్సిపాలిటీలకు ఈ నెల 30న పోలింగ్ జరగాల్సి ఉంది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పోలింగ్‌పై సందేహాలు నెలకొన్నాయి. ఎన్నికలు వాయిదా వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఎస్ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని అధికార పార్టీ చెబుతోంది. ఈసీ మాత్రం పోలింగ్ నిర్వహణకే మొగ్గు చూపుతోంది. అధికార, విపక్ష పార్టీలు మాత్రం జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు నైట్ కర్ఫ్యూ… ఇటు డేలో నాయకుల ప్రచారంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కరోనా విజృంభణ పీక్స్ లో ఉన్న వేళ ఎన్నికల నిర్వహణపై ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య పెరగడంతోపాటు మరణాలు సంభవిస్తున్నాయి. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల తర్వాత…సీఎం కేసీఆర్ సహా అనే మంది రాజకీయ నాయకులు, వందలాది మంది ప్రజలు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ తోపాటు ఐదు మునిసిపాలిటీలో కూడా ప్రతిరోజూ రికార్డుస్థాయిలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
తెలంగాణలో ఉన్న కరోనా పరిస్థితులపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. ఈ నెల 1 నుంచి 25 వరకు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 23.55 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించామని, వాటిలో 4.39 లక్షల ఆర్టీపీసీఆర్, 19.16 లక్షల ర్యాపిడ్ పరీక్షలు ఉన్నాయని వివరించింది. అదే సమయంలో మొత్తం 341 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. రాష్ట్రంలో 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నా రాజకీయ పార్టీలకు ఇదేమీ పట్టడం లేదు. రాజకీయ నాయకులు కరోనాను లెక్కచేయకుండా ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. మరీ ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ నేతలు అయితే పోటాపోటీగా రాజకీయ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు, వారి అనుచరగణం ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే, ఓటర్లను ప్రసన్నం చేసుకునే క్రమంలో గుంపులు గుంపులుగా తిరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
తెలంగాణలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని గవర్నర్ తమిళ సైకి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు లేఖలు ద్వారా విజ్ఝప్తి చేశాయి. ప్రభుత్వానికి ఎన్నికలపై ఉన్న శ్రద్ద.. ప్రజల ప్రాణాలపై లేదని ఆరోపించాయి. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ ఎన్నికలను వెంటనే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. కరోనా విపరీతంగా విజృంభిస్తున్నా… ప్రభుత్వం మాత్రం ఎన్నికలను వాయిదా వేయాల్సిన అవసరం లేదనటం బాధ్యతారాహిత్యమని విమర్శించాయి. అంతేకాదు, కరోనా కట్టడికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తామన్న సీఎం మాటలు బూటకమని బీజేపీ నేతలు దుయ్యబట్టారు. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్ మెంట్ చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు. కరోనా చికిత్సను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై.. ఎన్నికల నిర్వహణ పరిస్థితులపై ఆరా తీశారు. ఎలక్షన్ కమిషన్ గైడ్‌లైన్స్, ఆరోగ్యశాఖ రిపోర్ట్‌కు అనుగుణంగా.. ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ఎన్నికల కమిషనర్ వివరించినట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణపై సమగ్ర నివేదిక అందజేయాలని గవర్నర్ సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కరోనా సమయంలో ఎన్నికలు నిర్వహించాలంటూ కోర్టుకు వెళ్లింది. దీంతో ఎన్నికలను వాయిదా వేయకపోయినా కనీసం విజయోత్సవ ర్యాలీలు నిషేధించడం వల్ల కొంతమేరకు కరోనా కట్టడిని అడ్డుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తమిళనాడు ఎన్నికల్లో కొవిడ్ నిబంధనల అమలు విషయంలో మద్రాస్ హైకోర్టు ఎన్నికల కమిషన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొవిడ్ కేసులు కొనసాగుతున్నప్పటికీ ర్యాలీలు, రోడ్ షోల్లో ఆంక్షల అమలులో పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా సెకండ్ వేవ్ కు ఏకైక కారణం ఈసీ అని, ఇందుకు అధికారులపై హత్య కేసు నమోదు చేయాలని సైతం అభిప్రాయపడ్డారు.
ఇక, దేశంలో పశ్చిమ బెంగాల్ చివరి విడత ఎన్నికలు జరగాల్సి ఉండగా ..మరోవారం రోజుల్లో ఫలితాలు రానున్నాయి. దీంతో ఎన్నికల విజయోత్సవ ర్యాలీలపై ఈసీ నిషేధం విధించింది. కరోనా విజృంభిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల కమీషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులను కట్టడి చేసేందుకు ఎన్నికల విజయోత్సవ ర్యాలీలను నిషేధించింది. కాగా దేశంలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే..అయితే పశ్చిమ బెంగాల్ లో చివరి విడత ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా మే 2న ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే.