– హైదరాబాద్, ఆంధ్రప్రభ
గ్రామీణ ప్రాంత ప్రజలు అనేక సమస్యలతో ఒత్తిడి లోనవుతున్నప్పటికీ ఆరోగ్యపరంగా వారికి అంతగా అవగాహన లోపించడంతో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. సంపన్న దేశాలైన అమెరికా, ఇంగ్లండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాతో పాటు వర్ధమాన దేశాలతో పోల్చినప్పటికీ భారత్‌లో ఆ దేశాలకన్నా ఎక్కువ శాతంలో అత్యధిక ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్నట్లు సిగ్నా 360 వెల్-బీయింగ్ సర్వే వెల్లడించింది. ముఖ్యంగా 35-49 సంవత్సరాల మధ్య వయసుగల వారే ఎక్కువ శాతం ఒత్తిడితో అనారోగ్యం బారిన పడుతున్నట్లు ఆ అధ్యయనం పేర్కొంది. ఈ వయసు గ్రూపులోని 89 శాతం మంది కొంతస్థాయిలో ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. శారీరక, కుటుంబ, సామాజిక, ఆర్థిక, పని, సంక్షేమంపట్ల ప్రజల ఆలోచనల్లో మార్పులు రావలసిన అవసరం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ సంవత్సరం పలు ఆరోగ్య సంబంధిత అంశాలను సైతం జోడించడంవల్ల ఇప్పటి వరకూ విడుదలైన నివేదికలలో వెల్లడైంది. ఈ అధ్యయనంలో వర్క్‌ప్లేస్, వెల్‌నెస్ కార్యక్రమాల గురించి కూడా అభిప్రాయాలు సేకరించింది. ఇవి కూడా ఒత్తిడిని పెంచేందుకు దోహద పడుతున్నాయని ఆ అధ్యయనం పేర్కొంది.
గుండె ఆరోగ్యంపై అవగాహనా లోపం…
ఆందోళనతో వచ్చే అనారోగ్యం సమస్యలైన రక్తపోటు, గుండె సంబంధిత బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ)పై అవగాహన ఉన్నట్లు ఎక్కువ మంది వెల్లడించారు. అనేక దేశాలతో పోల్చితే మన దేశంలో ఈ వ్యాధులపై అవగాహన ఉన్నట్లు తేలింది. అయితే గుండె సమస్యలకు సంబంధించి 2.2 లక్షణాలను గురించి మాత్రమే భారతీయులకు తెలిస్తే, అంతర్జాతీయంగా 2.4 లక్షణాలపై అవగాహన ఉన్నది. జీవనశైలి మార్పులవల్ల అధిక రక్తపోటు నయం చేయవచ్చన్న విషయం ప్రతి ముగ్గురిలో ఒకరికి తెలియదు. గుండె ఆరోగ్య విద్యకు సంబంధించి కేవలం 38 శాతం మంది మాత్రమే ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తూ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నట్లు ఆ అధ్యయనంలో తేలింది.
ఇలా చేస్తే మేలంటున్న నిపుణులు…
జీవనశైలి మార్పు ద్వారా రక్తపోటును నియంత్రించుకోవచ్చని విషయం 30 శాతం మంది ప్రజలకు తెలియదు. రక్తపోటును నియంత్రణలో పెట్టుకోకుంటే గుండెపోటు దారి తీయవచ్చునన్న విషయం చాలా మందికి తెలియకపోవడం గమనార్హం. ఈ అధ్యయనంలో కనుగొన్న మరో ప్రధానాంశం గుండె జబ్బులు, స్ట్రోక్ కేసులు గత 25 ఏళ్ళుగా ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. అందువల్ల గుండెకు సంబంధించిన అవగాహన పెంచడం ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించడం అవసరమని అభిప్యాయం వ్యక్తమవుతోంది.
యువతరానికి అవగాహన నామమాత్రం…
ఇతర తరాలతో పోలిస్తే భారతీయ యువతరం (35-49) ఆరోగ్య సమస్యలపై పూర్తిగా అవగాహన పెంచుకోవడం లేదని తేలింది. మరీ ముఖ్యంగా వారి శారీరక, ఆర్థిక, వర్క్ వెల్‌నెస్ విషయంలో యువతరం ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని తేలింది. యువతరంపై ఒత్తిడి స్థాయిని నియంత్రించేందుకు సమర్థంగా ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరాన్ని అశ్రద్ధ చేస్తున్నట్లు వెల్లడైంది. యువతరంలో 89 శాతం మంది ఒత్తిడిని ఎదుర్కొంటుండగా, 50 ఏళ్ళు పైబడిన వారు 64 శాతం మంది, ఆ పైబడి వయసు వారు 87 శాతం మంది ఈ సమస్యతో బాధ పడుతున్నారని సిగ్నా అధ్యయనంలో తేలింది. ఈ రుగ్మతలతో సరైన రీతిలో బరువును నియంత్రించుకోకపోవడం అత్యంత సవాల్‌తో కూడిన సమస్యగా ఉన్నది.
ఒత్తిడి విషయంలో పురుషులకన్నా మహిళల్లో తక్కువగా ఉన్నట్లు తేలింది. మహిళల్లో అవగాహన ఎక్కువగా ఉండడంతో వర్క్‌ప్లేస్ వెల్‌నెస్ ప్రోగ్రామ్ కావాలని కోరుతున్నారు. మహిళలు పనిచేస్తున్న సంస్థల్లో ఒత్తిడి పెరుగుతుందని, వాటిని నివారించేందుకు సీనియర్ మేనేజ్‌మెంట్ సహకరించడం లేదని భావిస్తున్నారు. మహిళల్లో ఒత్తిడి కలిగించే అంశాల్లో ఆఫీస్ పని, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత ఆరోగ్య సంబంధిత రుగ్మతలు ఎక్కువగా ఉన్నాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది. అయితే మన దేశంలో వర్క్‌ప్లేస్ వెల్‌నెస్ కార్యక్రమాలు అంతర్జాతీయంగా పోలిస్తే రెట్టింపు శాతం ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోవడంలో అశ్రద్ధ వహిస్తున్నారని సిగ్నా అధ్యయనం వెల్లడించింది. అయితే తమ వర్క్‌ప్లేస్‌లో 96 శాతం మందిపై సహచరుల ప్రభావం పడుతుందని, ఇది అనేక ఒత్తిళ్ళకు లోను చేస్తుందని ఆ అధ్యయనం పేర్కొంది.