Friday, November 22, 2024

మే 6న బ్రిట‌న్ రాజుగా.. ఛార్లెస్3 ప‌ట్టాభిషేకం

గ‌త ఏడాది క్వీన్ ఎలిజిబెత్2 క‌న్నుమూశారు. అనంతరం బ్రిటన్ తదుపరి రాజుగా ఛార్లెస్‌-3 బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే 6వ తేదీన బ్రిటన్ రాజుగా ఛార్లెస్-3 పట్టాభిషేకం జరగనుంది. ఈ మేరకు రాజవంశం అధికారికంగా ప్రకటించింది.లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో మే 6వ తేదీన బ్రిటన్‌ రాజు చార్లెస్‌ పట్టాభిషేక కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఆదే సమయంలో క్వీన్ కాన్సార్ట్ కెమిల్లా కిరీట ధారణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. కార్యక్రమం అనంతరం ఆ తర్వాతి రోజున విండ్సర్ క్యాజిల్‌లో కూడా పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి సామాన్యులను కూడా అనుమతించనున్నారు. ఛార్లెస్‌-3, కెమిల్లా దంపతుల అధికారికంగా జరగనున్న ఈ పట్టాభిషేక మహోత్సవానికి 2వేల మందిని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.

మరో రెండు రోజుల్లో ఆహ్వానాలు పంపనున్నట్లు రాజకుటుంబ వర్గాలు వెల్లడించాయి. ఇన్విటేషన్‌ కార్డును కూడా ది రాయల్‌ ఫ్యామిలీ ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేసింది. బ్రిటన్ రాజు చార్లెస్‌-3 పట్టాభిషేకం జరగనున్న నేపథ్యంలో రాజవంశం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టాభిషేకంలో కోహినూర్ వజ్రాన్ని వినియోగించకూడదని నిర్ణయించింది. వలస రాజ్యాల పాలనకు గుర్తుగా బ్రిటన్‌ రాచకుటుంబం చేతిలో ఉన్న వివాదాస్పద కోహినూర్‌ వజ్రం లేని కిరీటంతోనే తన భర్త, కింగ్‌ ఛార్లెస్‌-3 పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనాలని బ్రిటన్‌ రాణి కెమిల్లా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇప్పటికే బకింగ్‌హాం ప్యాలెస్‌ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. క్వీన్ కాన్సార్ట్ అయిన కెమిల్లా కిరీట ధారణ కార్యక్రమంలో ఈ వజ్రానికి బదులు.. మరో కిరీటాన్ని ధరించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement