హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఏ ఏడాది 2021-22 రబీలో తెలంగాణ నుంచి వరి ధాన్యం కొనుగోలు విషయంలో అనేక కొర్రీలు పెట్టిన భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)… ఈ ఏడాది ఖరీఫ్‌లో గతేడాది 2021-22 ఖరీఫ్‌లోకంటే ఎక్కువ వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. మరోసారి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కొర్రీలు విధించకపోతే ఈ ఏడాది 2022-23 ఖరీఫ్‌లో వరి పండించే రైతులు తమ పంటను సులువుగా అమ్ముకునే అవకాశాలు లభించనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ఈ ఖరీఫ్‌లో తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలుకు సిద్ధమవుతోంది.
గతేడాది ఖరీఫ్‌లో దేశ వ్యాప్తంగా 509.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా ఈ ఏడాది 518లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎఫ్‌సీఐ లక్ష్యంగా పె ట్టుకుంది. గతేడాది 2021-22 ఖరీఫ్‌లో తెలంగాణ రైతులు 90లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించారు. ఈ ధాన్యన్నంతా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసింది. అయితే 2022-23 రబీలో తెలంగాణ నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం అనేక కొర్రీలు విధించింది. అయితే ఈ సారి ఖరీఫ్‌లో పెద్ద ఎత్తున ధాన్యాన్ని ఎఫ్‌సీఐ కొనుగోలు చేయనుండడంతో తెలంగాణ రైతులకు ఈసారైనా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందా..? లేక రబీలో మాదిరిగానే ఇబ్బందులు సృష్టిస్తుందా..? అన్నది వేచి చూడాలి.