దేశంలో మొదటిసారి వెలుగుచూసిన బి.1.617 విభాగంలోని మూడు వేరియంట్లలో డెల్టా రకంగా పేర్కొంటున్న బి.1.617.2 వేరియంటే రెండో దశ విజృంభణకు మూల కారణమని ప్రభుత్వ అధ్యయనం తేల్చింది. బ్రిటన్‌లో వెలుగు చూసిన ఆల్ఫా వేరియంట్ కంటే డెల్టా వేరియంటే వేగంగా వ్యాపిస్తుందని పేర్కొంది. భారత్‌లో దాదాపు 12,200 వేరియంట్లు ఉన్నాయని వాటిలో డెల్టా వేరియంటే అత్యంత ప్రమాదకరమైందని తెలిపింది. భారత జీనోమిక్ కన్సార్షియా, జాతీయ వ్యాధి నియంత్రణా కేంద్రం(ఎన్సీడీసీ) కలిసి నిర్వహించిన జన్యుక్రమ విశ్లేషణ అధ్యయనంలో ఈ విషయాలు వెలుగు చూశాయి.
డెల్టా వేరియంట్ మినహా మిగిలిన రకాలు చెప్పుకోదగ్గ స్థాయిలో వ్యాపించడం లేదని అధ్యయనం పేర్కొంది. కాలక్రమంలో వాటన్నింటి స్థానాన్ని డెల్టా వేరియంటే ఆక్రమించిందని తెలిపింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో డెల్టా వేరియంట్ వ్యాప్తి ఉందని.. రెండో దశలో అత్యంత తీవ్రంగా ప్రభావితమైన ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణలో మరింత ఎక్కువగా ఉందని పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రారంభమైన తర్వాత కూడా కరోనా విజృంభణలో డెల్టా వేరియంట్ పాత్రే కీలకంగా ఉందని అధ్యయనం తేల్చింది.
మరోవైపు వ్యాక్సినేషన్ ప్రారంభమైన తర్వాత ఆల్ఫా వేరియంట్ వ్యాప్తి మాత్రం గణనీయంగా తగ్గిపోయినట్లు వెల్లడించింది. అయితే, కొవిడ్ మరణాల పెరుగుదల, వ్యాధి తీవ్రత ముదరడానికి డెల్టా వేరియంటే కారణమని చెప్పడానికి మాత్రం ఎక్కడా ఆధారాలు లేవని పేర్కొంది. మొత్తం 29 వేల నమూనాలకు జన్యుక్రమ విశ్లేషణ చేయగా.. 8,900 శాంపిల్స్‌లో బి.1.617 కరోనా రకాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఈ 8,900 నమూనాల్లో దాదాపు వెయ్యికి పైగా శాంపిల్స్‌లో డెల్టా వేరియంట్ ఉన్నట్లు తేల్చింది. భారత్‌లో డెల్టా వేరియంట్ మాత్రమే ఆందోళనకరంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇదే విభాగానికి చెందిన మిగతా రెండు వేరియంట్ల వ్యాప్తి మితంగానే ఉన్నట్టు పేర్కొంది.