కరోనా వైరస్ డెల్టా వేరియంట్ చాలా ప్రమాదకరమని అమెరికా వైద్యులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో భారత్‌లో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం నమోదయ్యింది. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో డెల్టా ప్లస్ వేరియంట్ సోకి బుధవారం ఒక మహిళ మృతి చెందింది. మృతురాలి నుంచి తీసుకున్న నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ ఆధారంగా సదరు మహిళ కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ వల్లనే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
సదరు మహిళ ఈ ఏడాది మే 23న డెల్టా వేరియంట్ బారిన పడినట్లు తెలిపారు. బాధితురాలి కంటే ముందు ఆమె భర్తకు కోవిడ్ సోకిందని.. కానీ అతడు అప్పటికే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నాడని పేర్కొన్నారు. ఫలితంగా అతడు కోలుకున్నాడన్నారు. కానీ బాధితురాలు మాత్రం వ్యాక్సిన్ ఒక్క డోసు కూడా తీసుకోలేదని.. అందువల్లే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు.
మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకు మొత్తం 5 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. వీటిలో మూడు భోపాల్ నుంచి కాగా రెండు ఉజ్జయిని నుంచి. ఈ ఐదుగురిలో వ్యాక్సిన్ వేయించుకున్న నలుగురు డెల్టా ప్లస్‌వేరియంట్‌ను జయించగా.. వ్యాక్సిన్ తీసుకొని మహిళ మృతి చెందారు. మహమ్మారి రూపం మార్చుకుని శక్తివంతంగా తయారవుతుంది. ఈ క్రమంలో కోవిడ్ బారిన పడినా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవాలంటే టీకా వేయించుకోవడం తప్పనిసరి. కనుక ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. 21 డెల్టా ప్లస్ కేసులు బయటపడటంతో మహారాష్ట్ర సర్కార్ అప్రమత్తమయ్యింది.