దేశంలో కరోనా వైరస్ క్రమంగా తగ్గుతుండగా.. కొత్తగా డెల్టా ప్లస్ వేరియంట్ భయాందోళనలు కలిగిస్తోంది. డెల్టా ప్లస్ కారణంగా ఇప్పటికే తొలి మరణం సంభవించగా.. కేసులు సంఖ్య పేరుతోంది. కరోనా సెకండ్ కారణంగా విలవిలలాడిన భారత్‌లో జనజీవనం స్తంభించింది. అయితే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ ను ఎత్తివేశాయి. కరోనా థర్డ్ వేవ్ ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో ఇప్పుడు డెల్టా ప్లస్ ఆందోళన కలిగిస్తోంది. కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో వైరస్ నుంచి పూర్తిగా బయటపడొచ్చొన్న ఆశలపై.. మహమ్మారి కొత్త వేరియంట్లు నీళ్లు చల్లుతున్నాయి.
కరోనా సెకండ్ వేవ్ కు కారణమైన డెల్టా వేరియంట్ రూపాంతరం చెంది డెల్టా ప్లస్ గా మారినట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే . ప్రస్తుతం దేశంలో 40కిపైగా డెల్టా ప్లస్ కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర , కేరళ , మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదు కాగా .. కర్ణాటక , తమిళనాడు, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల్లోనూ కేసులు మొదలయ్యాయి. ఈ డెల్టా ప్లస్ ను గుర్తించిన వారిలో తొలిసారిగా మధ్యప్రదేశ్ లోని ఓ మహిళా చనిపోయింది. అయితే, ఆ మహిళ ఎటువంటి వ్యాక్సిన్ తీసుకోకపోవడంతో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని డాక్టర్లు చెప్పారు . ఇక ఈ కొత్త వేరియంట్ ప్రమాదకరమయ్యే అవకాశం ఉందన్న అంచనాలతో కేంద్ర ప్రభుత్వం దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా ప్రకటించింది.
మరోవైపు ఈ డెల్టా ప్లస్ వేరియంట్ మరింత శక్తివంతమని , వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణుల , శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ సోకిన వారి పక్క నుంచి మాస్కు పెట్టుకోకుండా వెళ్లినా కూడా వైరస్ సోకే అవకాశం ఉందని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( ఎయిమ్స్ ) డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా ఇటీవల వెల్లడించారు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కొత్త వేరియంట్ సోకుందని హెచ్చరించారు . మాస్కులు , శానిటైజేషన్ , భౌతిక దూరం వంటి కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ డెల్టా ప్లస్ వేరియంట్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఔషధాన్ని తట్టుకుంటుందని , రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుంటుందన్న అంచనాలు ఉన్నాయని తెలిపారు. రానున్న ఆరు నుంచి ఎనిమిది వారాలు అత్యంత కీలకమన్నారు.
దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిషీల్డ్ , కోవార్టిన్ టీకాలు డెల్టా రూపాంతరితం నుంచి కూడా రక్షణ కల్పిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. కానీ డెల్టా ప్లస్ విషయంలో టీకాల సమర్థత ఎంత అన్నది ఇంకా తేలలేదు. టీకా ఒక డోసు తీసుకున్న తర్వాత కొందరు వైరస్ బారిన పడటాన్ని బట్టి చూస్తే కొత్త రూపాంతరితాలపై టీకా ప్రభావం తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్ సింగిల్ లేదా డబుల్ డోసు తీసుకున్న ముగ్గురు ఈ వేరియంట్ బారినపడినప్పటికీ కోలుకున్నారని వైద్యులు వెల్లడించారు.
ఇది ఇలా ఉంటే.. కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా దేశంలో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆంక్షలను కొనసాగించాలని ఆదేశించింది.
ఇదీ చదవండి: డెల్టారకం వైరస్ ను కట్టడి చేస్తున్న ఫైజర్..