హైదరాబాద్, ఆంధ్రప్రభ : సుమూహుర్తానికి పెళ్లి జరగాలని కోరుకోవటం, గృహ ప్రవేశం చేయాలనుకోవటం, లేదంటే మరో కార్యక్రమాన్ని, శుభాకార్యాన్ని నిర్వహించటం చూస్తుంటాం. కాని విచిత్రంగా రాష్ట్రంలో ఇటీవల పిల్లలను కనేందుకు కూడా పూజారులు ముహూర్తం ఫిక్స్ చేస్తున్న మూఢనమ్మకం వేగంగా వ్యాపిస్తోంది. ప్రయివేటు ఆసుపత్రులు పెద్ద సంఖ్యలో సీజేరియన్ ఆపరేషన్లు చేస్తుండటంతో మూహుర్తానికి, మంచిరోజున బిడ్డను కనే జాడ్యం రోజు రోజుకూ పెరిగిపోతోంది. ప్రయివేటు ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య ఇప్పటిికీ చాలా తక్కువగా ఉంది. కాసులకు కక్కుర్తిపడుతున్న ప్రయివేటు ఆసుపత్రులు… సాధారణ ప్రసవం చేస్తే డబ్బులు దండుకునే అవకాశం లేకపోవడంతో కడుపు కోసి బిడ్డను బయటకు తీసి తల్లిదండ్రులచేతిలో పెడుతున్నాయి. మరో అడుగు ముందుకేసి అష్టమి, నవమి, రోజు, తిథి, నక్షత్రం, రాహుకాలం, వ్యర్జ్యం ఈ మూఢనమ్మకాలు నిర్ణయించిన రోజున, వేళకు,మూహుర్తానికి తల్లి గర్భం నుంచి బిడ్డను బయటకు తీస్తున్నారు. అందుకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చేయాల్సిందిల్లా వైద్యులకు అధనంగా కొంత డబ్బును ఇచ్చుకుంటే చాలు. ఈ మూఢనమ్మకం ఇటీవల రాష్ట్ర మంతటా వ్యాపించింది. ఎమర్జెన్సీ అయితేనే సీజేరియన్ ఆపరేషన్ చేయాలని డాక్టర్లను, బిడ్డలను కనేందుకు మూహుర్తాలు నిర్ణయించొద్దని పూజారులను కోరాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి.
ఈ ముహూర్తాలు ప్రయివేటు ఆసుపత్రుల కాసుల కక్కుర్తి కారణాలు వెరసి తెలంగాణ రాష్ట్రం సీ సెక్షన్ ఆపరేషనల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో తమిళనాడు ఉండగా… ఆ తర్వాతి స్థానం తెలంగాణదే. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ప్రసవాల్లో 53. 51 శాతం సీజేరియన్లతోనేనని ఇటీవల నీతిఆయోగ్ వెల్లడించింది. ఇక రాష్ట్రం లోని ఖమ్మం , కరీంనగర్ జిల్లాల్లో సీ సెక్షన్ ఆపరేషన్లు ఇతర జిల్లాల్లో కంటే ఎక్కువగా జరుగుతున్నాయి. కరీంనగర్‌లో 69.93 జననాలు సీజేరియన్లతోనే జరుగుతుండగా… ఖమ్మం లో 65.42 సీజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయి.
డెలివరీలకు ముహుర్తాలు నిర్ణ యించొద్దు – కరీనంగర్ జిల్లా కలెక్టర్
ఈ పరిస్థితుల్లో జననాలకు/డెలివరీలకు ముహూర్తాలు నిర్ణయించొద్దని పూజారులను కరీంనగర్ జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా కోరాల్సి వచ్చింది. అవసరమైతే తప్ప సీజేరియన్ ఆపరేషన్లు చేయొద్దని జిల్లా కలెక్టర్ ఆర్‌వీ. కర్ణన్ వైద్యులను కోరారు. ఈ మేరకు శనివారం వైద్యులు, పూజారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.