Tuesday, November 26, 2024

ఢిల్లీలో తగ్గిన కరోనా… లాక్ డౌన్ ను ఎత్తేస్తామన్న కేజ్రీవాల్!

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. దీంతో రాష్ట్రంలో లాక్ డౌన్ ను ఎత్తివేయనుంది కేజ్రీవాల్ సర్కార్. ఢిల్లీలో చాలా రోజుల పాటు ప‌దివేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో లాక్ డౌన్ ను విధించారు. అయితే, ప్రస్తుతం కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈక్రమంలో సోమవారం నుంచి దశల వారిగా లాక్ డౌన్ ను సడలించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

ఢిల్లీలో కరోనా ఉద్ధృతి తగ్గిన నేపథ్యంలో ఆన్ లాక్ ప్రక్రియను ప్రారంభిస్తామని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. గడిచిన 24 గంటల్లో 1100 కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. పాజిటివిటీ రేటు 1.5 శాతం ఉందన్నారు. ప్రజలు ఆకలితో చనిపోయే పరిస్థితి నెలకొందని, అందుకే దశల వారిగా ఆన్ లాక్ ప్రక్రియను అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ 19న విధించిన లాక్ డౌన్ సత్ఫలితాలు ఇచ్చిందన్నారు. ఈ రోజు జరిగిన విపత్తు నిర్వహణ అథారిటీతో సమావేశంలో ఆన్ లాక్ పైనే చర్చ జరిగిందన్నారు. జీవనోపాధి కోసం దూర ప్రాంతాల నుండి ఢిల్లీకి వచ్చిన రోజువారీ కూలీలు, కార్మికులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.  ఇంకో వారం రోజుల్లో లాక్ డౌన్ ను క్రమంగా ఎత్తేస్తామని చెప్పారు. అందరి ఏకాభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ నెల 31 తర్వాత లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement