మొన్నటిదాకా అయిదు రాష్ట్రాల ఎన్నికలతో హీటెక్కిన ఉత్తర భారతం ఇప్పుడు ఢిల్లీలో మాటలతో మంటలు పుట్టిస్తోంది. ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికలను వాయిదా వేయాలని కేంద్రం ఈసీకి లేఖ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై కేజ్రీవాల్ బీజేపీని టార్గెట్ చేయగా.. అంతే దీటుగా బీజేపీ నేత స్మృతి ఇరానీ కౌంటర్ ఇచ్చారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్రం లేఖ రాయడం ఇదే తొలిసారి అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఆరోపించారు. ఎన్నికలను రద్దు చేయాలని ECని బలవంతం చేయడం దారుణమన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు అని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. ఉత్తర ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్, సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, తూర్పు ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్లను కలపాలని కోరుతున్నందున ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ కేంద్రం ఈసీకి లేఖ రాసింది. దీంతో ఈసీ కూడా వెంటనే ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.”అని కేజ్రీవాల్ చెప్పారు.
అయితే.. దీనికి కౌంటర్‌గా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కేజ్రీవాల్ తీరుపై మండిపడ్డారు. ఢిల్లీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే MCD ఉద్యోగులకు రూ.13,000 అందజేస్తోందని ఆరోపించారు. ఉత్తరాఖండ్‌లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చి డిపాజిట్ కోల్పోయారని విమర్శలు సంధించారు. MCD పార్క్ , JJ క్లస్టర్ అభివృద్ధి.. ఇతర పనుల అభివృద్ధి నిధిని కేజ్రీవాల్ ఎందుకు అడ్డుకున్నారు? MCD సంస్కరణ ప్రక్రియను నిరోధించడంలో అతనికి ఎందుకు అంత ఆసక్తి ఉంది అని స్మృతి ప్రశ్నించారు.
ఉత్తరప్రదేశ్‌లో నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకుని, ఉత్తరాఖండ్‌లో 70 సీట్లలో 55 ఓడిపోయి, గోవాలో కేవలం 6% ఓట్లు తెచ్చుకున్న పార్టీ అధ్యక్షుడు దేశ విజయవంతమైన ప్రధానమంత్రిని అపహాస్యం చేస్తున్నాడని స్మృతి ఇరానీ మండిపడ్డారు. అయితే.. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఢిల్లీ ఆప్ నేత మనీష్ సిసోడియా స్మృతి ఇరానీపై విరుచుకుపడ్డారు. “కాంగ్రెస్‌లా ఏడుపు ఆపండి. మీకు ధైర్యం ఉంటే పారిపోకండి, మాతో పోటీ చేయండి అని సిసోడియా అన్నారు. అంతేకాకుండా ఇక్కడ మీరు 10 సీట్లు సాధించగలిగితే అది మీకు పెద్ద విజయం అంటూ సవాల్ చేశారు.