దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండడంతో ప్రభుత్వం లాక్ డౌన్ ను క్రమక్రమంగా ఎత్తేస్తున్నారు. ఢిల్లీలో మాల్స్, షాపులు, మెట్రో సర్వీసులు అన్ని ప్రారంభమైయ్యాయి. మూడు వారాల తర్వాత ఢిల్లీలో మెట్రో సర్వీసులు ప్రారంభమయ్యాయి. 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో మెట్రో నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మెట్రో ప్రారంభమైనా ప్రస్తుతానికి సగం రైళ్లనే నడుపుతున్నారు. రైళ్ల వేళల్లోనూ మార్పులు చేశారు. ఇంతకుముందు ఐదు నిముషాలకో రైలు వచ్చేది. ఇప్పుడు దానిని 15 నిముషాలకు పెంచారు. కరోనా లాక్ డౌన్‌తో మే 20 నుంచి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ పూర్తిస్థాయిలో సేవలను నిలిపివేసింది.
మరో వైపు మాల్స్, మార్కెట్లు, దుకాణాలు సరి-బేసి విధానంలో తెరువనుండగా.. సినిమా థియేటర్లు, రెటస్టారెంట్లు, బార్లు, జిమ్‌లు, స్పాలు, సెలూన్లు, బ్యూటీ ఫార్లర్లు మూసే ఉండనున్నాయి. ప్రైవేటు కార్యాలయాలు సైతం 50శాతం సిబ్బందితో పని చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రూప్ ఏ సిబ్బంది వంద శాతం సామర్థ్యంతో, గ్రూప్-బీలో 50శాతం మంది సిబ్బందితో పని చేయనున్నాయి.
కేసులు భారీగా పెరిగిపోతుండడంతో రెండు నెలల క్రితం ఢిల్లీలో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కఠిన ఆంక్షలు, నిర్ణయాలతో అక్కడ కేసులు 400 దిగువకు వచ్చేశాయి. ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో మే 31న అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైంది. రోజు రోజుకు కేసులు తగ్గుముఖం పడుతుండడంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం నుంచి మరిన్ని సడలింపులు ప్రకటించారు.