ఢిల్లీ యూనివర్సిటీలో దారుణం జరిగింది. ఇవ్వాల (ఆదివారం) రాత్రి యూనివర్సిటీలో ఇద్దరు విద్యార్థులు పరస్పరం దాడులకు తెగబడ్డారు. సౌత్ క్యాంపస్‌లో ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలో ఒక విద్యార్థిని మరో విద్యార్థి కత్తితో పొడిచి చంపినట్టు తెలుస్తోంది. ఢిల్లీ యూనివర్సిటీలోని ఆర్యభట్ట కళాశాల వెలుపల 19 ఏళ్ల విద్యార్థిని కత్తితో పొడిచి చంపారు. నిఖిల్ చౌహాన్ అనే విద్యార్థి యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్‌లో చేరాడు. అతని తరగతులకు హాజరయ్యేందుకు కళాశాలకు వచ్చాడు. ఏడు రోజుల క్రితం గొడవ పడిన నిఖిల్‌పై మరో విద్యార్థి కత్తితో దాడి చేశాడు. నిఖిల్ ప్రియురాలితో విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించాడని, దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది.
కాగా, ఇవ్వాల (ఆదివారం) నిందితుడు విద్యార్థి తన ముగ్గురు సహచరులతో వచ్చి కళాశాల గేటు బయట నిఖిల్‌ను కత్తితో పొడిచాడు. మోతీ బాగ్‌లోని చరక్ పాలికా ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. నిఖిల్ పొలిటికల్ సైన్స్ లో బిఎ ఆనర్స్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతను పశ్చిమ విహార్ నివాసిగా అతని స్నేహితులు చెప్పారు.
నిందితుడిని గుర్తించడానికి టీమ్ ఏర్పాటు
ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనల క్రమాన్ని నిర్ధారించడానికి పోలీసులు నేరస్థలం, చుట్టుపక్కల అమర్చిన సిసిటివి కెమెరాలను పరిశీలించనున్నట్టు తెలుస్తోంది. నిందితులను పట్టుకునేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. నిఖిల్ మృతదేహాన్ని శవపరీక్ష అనంతరం కుటుంబసభ్యులకు అప్పగిస్తామని పోలీసులు చెప్పారు.
ఈ ఘటనను దురదృష్టకరంగా ఢిల్లీ యూనివర్శిటీ పేర్కొంది. విద్యార్థులు చదువుకునేందుకు, వృత్తి పరమైన నైపుణ్యం పెంచుకోవడానికి వచ్చి ఇలా దాడులు చేసుకోవడం దారుణం అని వెల్లడించింది. అమూల్యమైన ప్రాణాన్ని కోల్పోయినందుకు తాము చింతిస్తున్నామని వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
సౌత్ వెస్ట్ ఢిల్లీలో ఒక్క రోజే 3 హత్యలు
నిఖిల్ మరణంతో నైరుతి ఢిల్లీ జిల్లాలో 24 గంటల వ్యవధిలో మొత్తం మూడు హత్యలు జరిగాయి. ఢిల్లీలోని ఆర్కే పురం ప్రాంతంలో ఇద్దరు సోదరీమణులను కాల్చి చంపిన కొన్ని గంటల తర్వాత నిఖిల్ హత్య జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఆర్కే పురంలో ఇద్దరు మహిళలు కాల్పులకు తెగబడ్డారు. ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడిని, అతని ఇద్దరు సహచరులను పోలీసులు అరెస్టు చేశారు. దాడి వెనుక ప్రధాన ఉద్దేశం నగదు వ్యవహారం కానీ, సెటిల్మెంట్ సమస్యకు సంబంధించినదిగా కనిపిస్తోందన్నారు. దుండగులు ప్రధానంగా బాధితురాలి సోదరుడిని లక్ష్యంగా చేసుకున్నారని, అయితే వివాదంలో పొరపాటున మహిళలను కాల్చిచంపారని ప్రాథమిక సమాచారం అందుతోంది.