ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తూ జనాభాలో 60 శాతం జనాభా కలిగిన బి.సి లు స్వతంత్ర భారతదేశంలో దోపిడికి గురవుతున్న బి.సి ల జనగణన కోసం దేశ వ్యాప్త ఉద్యమం చేయాలని అందుకోసం తెలంగాణ బి.సి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ చొరవ తీసుకోవాలని బి.సి స్టడీ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు సాయిని నరేందర్ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో బిసి జనగణన కోసం చేపట్టిన ధర్నాలో ఆయన ప్రారంభ ఉపన్యాసం చేసి మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే.. వేల ఏండ్లుగా చాకిరి చేస్తున్న బి.సి ల బతుకులు బాగుపడుతాయని ఆశపడితే ఆ ఆశలన్నీ అడిఆశాలే అయ్యాయని, గత పాలకుల లాగానే బి.సి జనగణన పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేయడానికి వచ్చిన బి.సి లను పోలీసులచే అడ్డుకుని ఇబ్బందులకు గురిచేయడం బిజెపి పార్టీ నియంత పాలనకు నిదర్శనమని అన్నారు. బిసి ల జనగణన, బి.సి లకు చట్టసభల్లో, విద్య, ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మ్యానిఫెస్టోలో పెట్టె పార్టీలకే బి.సి ల ఓట్లు వేస్తామని బి.సి లు ప్రతినభూనాలని నరేందర్ పిలుపునిచ్చారు.
ధర్నాను ఉద్దేశించి తెలంగాణ బి.సి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ మాట్లాడుతూ బి.సి జనగణన జరిపి, చట్టసభల్లో, విద్య, ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టకుంటే ఉద్యమాన్ని దేశ వ్యాపితం చేసి బిజెపి పార్టీని ఓడిస్తామని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బి.సి జనగణన చేయాలని డిమాండ్ చేసిన బిజెపి పార్టీ గద్దెనెక్కినంక మాట మార్చడం దుర్మార్గమని ఆయన విమర్శించారు. ఈ ధర్నాకు మద్ధతుగా హాజరైన సుధాగాని ఫౌండేషన్ చైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్ మాట్లాడుతూ జనగణన కోసం, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ల కోసం ఎంతో వ్యయ ప్రయసాలకోర్చి డిల్లీ కి వచ్చి మీరు చేస్తున్న పోరాటం కేంద్ర ప్రభుత్వాన్ని కదిలిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాది రాచకొండ ప్రవీణ్, బహుజన మహిళా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు పటేల్ వనజ, తెలంగాణ సమరయోధుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి వెలుగు వనిత, కురుమ సంఘం రాష్ట్ర నాయకులు మండల కుమారస్వామి, రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమార్ గాడ్గే, ఒబిసి ఫ్రంట్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు, మహేష్ మానవ్, తెలంగాణ బి.సి సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు భీమగాని సౌజన్య, రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షుడు దేవరకొండ నరేష్ చారి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాసమల్ల లక్ష్మణ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బండారు దేవేందర్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బొల్లం లింగమూర్తి, రాష్ట్ర సంయుక్త కార్యాదర్శులు జగడం వెంకన్న, తౌటం సత్యం, రాష్ట్ర నాయకులు గుండెబోయిన మహేష్ యాదవ్, పాండురంగం యాదవ్, నాయిని భరత్, సరికొండ రామకృష్ణం రాజు తదితరులు పాల్గొని ప్రసంగించగా మీసాల గణేష్ కళా బృందం చైతన్య గీతాలు ఆలపించారు.