హ్యాట్రిక్ కోసం చీపురు పార్టీ పరుగులు
ఈసారైనా పాగా వేయాలని కమలనాథుల ఆశలు
రెండు పార్టీలకు ఉచిత పథకాలే ప్రచార అస్త్రాలు
ఆప్‌కు పోటీగా ఉచితాలను ప్రకటించిన బీజేపీ
ఉచితాలు వద్దంటూనే ఫ్రీ పథకాలతో ప్రచారం
ఆస్థిత్వం కోసమే పోటీపడుతున్న కాంగ్రెస్ పార్టీ
ఆంధ్రప్రభ, సెంట్రల్ డెస్క్ :
ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే 2012లో చేపట్టిన అవినీతి నిర్మూలన ఉద్యమం నుంచి పురుడు పోసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ రాజకీయ స్వరూపాన్ని మార్చేసింది. 2013లో అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి తొలిసారే 28సీట్లను గెలిచింది. చిరకాలంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉన్న ద్విముఖ పోటీని ఆప్ త్రిముఖ పోరుగా మార్చేసింది. 2013లో ఆప్ తొలిసారి ఏర్పరచిన ప్రభుత్వం 49 రోజులపాటే కొనసాగింది. 2015 ఎన్నికల్లో అసెంబ్లీలోని 70 సీట్లకు ఆప్ ఏకంగా 67 స్థానాలను చేజిక్కించుకుంది. ఇక.. 2019లో జరిగిన ఎన్నికల్లోనూ 62 స్థానాల్లో గెలిచి మరోసారి అధికారం చేపట్టింది.. తాజా ఎన్నికల్లోనూ గెలుపు ధీమాతో ముందుకు సాగుతోంది.
ఢిల్లీ జనం ఆదరణ పొందిన చీపురు..
ఢిల్లీలో ఆప్ అధికారం చేపట్టాక విద్య, వైద్యం, ఇతర ప్రజాసేవలను మెరుగుపరిచి పౌరుల మన్ననలు పొందింది. మొహల్లా క్లినిక్ ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల పనితీరు ప్రమాణాలను పెంచడం ఆప్ పాలనకు మంచిపేరు తెచ్చాయి. తద్వారా 2020 ఎన్నికల్లోనూ ఆ పార్టీ మరోసారి గెలుపొందింది. ఆ ఎలెక్షన్లలో 62 సీట్లు, 53 శాతానికిపైగా ఓట్లు సాధించింది. అయితే.. ఇటీవల అవినీతి ఆరోపణలు, మద్యం కుంభకోణం ఆప్ ప్రతిష్ఠను మసకబార్చాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 24.17శాతం ఓట్లనే దక్కించుకున్న ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. మరి ఈ ఎన్నికల్లో మరిన్ని హామీలతో ఢిల్లీ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న ఆప్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
కమలనాథుల కల నెరవేరుతుందా…
ఢిల్లీ అసెంబ్లీకి 1993లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో మదన్‌లాల్ ఖురానా నాయకత్వంలో బీజేపీ మెజారిటీ సాధించింది. పట్టణ కేంద్రిత విధానాలు, బలమైన సంస్థాగత నిర్మాణంతో బీజేపీ 1990లో ఢిల్లీ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించింది. 1998లో షీలా దీక్షిత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అసెంబ్లీని చేజిక్కించుకుంది. దేశ రాజధానిని ప్రపంచ శ్రేణి నగరంగా తీర్చిదిద్దుతానని షీలా దీక్షిత్ నగర పౌరుల మన్ననలు చూరగొన్నారు. ఆ తర్వాత జరిగిన ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగిలినా నగర పాలక సంస్థ, లోక్‌సభ ఎన్నికల్లో పైచేయి సాధిస్తూ వచ్చింది. 2014-24 మధ్య మూడు లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలను బీజేపీ గెలుచుకుంది. 2013 తర్వాత నుంచి అసెంబ్లీలో మాత్రం ఆధిక్యత సాధించలేకపోతోంది. 2013లో ఏకంగా 31 అసెంబ్లీ సీట్లు గెలిచిన కమలనాథులు 2015లో 3 సీట్లు, 2020లో 8 సీట్లతో మాత్రమే సరిపెట్టుకున్నారు.
ఉచితాలు వద్దంటూనే.. ఢిల్లీలో ఉచితాల ప్రకటన..
ఉచిత పథకాలకు దూరంగా ఉండే కమలనాథులు తాజాగా యూ టర్న్ తీసుకున్నారు. రెండు సార్లు ఆప్ చేతిలో భంగపడ్డ బీజేపీ ఈసారి ఎలాగైనా హస్తిన పీఠం కైవసం చేసుకునేందుకు తన సర్వ శక్తులను ఒడ్డుతోంది.. దీంతో ఆ పార్టీ ఉచిత తాయిలాను బయటకు తీసింది.. ఆప్, కాంగ్రెస్ పార్టీలకు తీసిపోని విధంగా ఢిల్లీ ఓటర్లపై ఫ్రీ పథకాలను కుమ్మరించింది.. దేశ రాజధాని వాసులకు పలు సంక్షేమ పథకాలతో పాటు ఉచితాలతో భరోసా ఇస్తూ భారతీయ జనతా పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో ‘సంకల్ప్ పత్ర-1’ను ప్రకటించింది.
మహిళల ఆర్థిక సాయం.. సబ్సిడీపై గ్యాస్ సిలెండర్
ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఢిల్లీలోని ప్రతి మహిళలకు ₹2,500 ఆర్థిక సాయం అందిస్తామని బీజేపీ ప్రకటించింది. మహిళా సాధికారికత లక్ష్యంగా వారికి మరింత ఆర్థిక పరిపుష్టి కల్పిస్తామని హామీ ఇచ్చింది. ధరల పెరుగులతో గృహాలపై పడుతున్న భారాన్ని దష్టిలో ఉంచుకుని ఎల్పీజీ సిలెండర్లపై ₹500 సబ్సిడీ ఇస్తామని వాగ్దానం చేసింది. పండుగలకు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తానని హామీ ఇచ్చింది. ఇక వృద్దాప్యపు పించన్ ₹2500 నుంచి ₹3000 దాకా ఇస్తామని పేర్కొంది. మరి ఈ పథకాలు కమలనాథులను గట్టెక్కిస్తాయో లేదో వేచి చూడాల్సిందే..
అస్థిత్వం కోసం కాంగ్రెస్ పోరు..
ఢిల్లీలో 1998 నుంచి 2013 వరకు షీలా దీక్షిత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉండేది. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులు, సామాజిక సంక్షేమ పథకాలు. చేపట్టారు. ఢిల్లీ మెట్రో నిర్మాణం, విద్యుత్, తాగునీటి సరఫరా మెరుగుదల వంటి కార్యక్రమాలతో వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రభుత్వాలను ఏర్పరచారు. అనంతర కాలంలో కాంగ్రెస్ ఓట్ల శాతం తగ్గిపోతూ వచ్చింది. 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 24.6శాతం ఓట్లు ఒడిసిపట్టిన కాంగ్రెస్ 2020కి వచ్చేసరికి 4.3శాతంతో సరిపెట్టుకుంది. గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ కనీసం ఒక్క సీటునైనా గెలవలేకపోయింది. మళ్లీ అధికారంలోకి వస్తే షీలా దీక్షిత్ మాదిరిగా రాజధానిని అభివృద్ధి పథంలో నడిపిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. అయితే.. ఢిల్లీలో బలమైన కాంగ్రెస్ నేతలు లేకపోవడంతో కేవలం అస్థిత్వం కోసం పోటీ పడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
బరిలో నిలిచిన యోధులు..
ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజీవాల్, బీజేపీ అభ్యర్థి సర్వేశ్ వర్మ, కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీలోనే అత్యధికంగా 23మంది పోటీలో ఉన్నారు. ఆ తర్వాత జనకపురిలో 16మంది, రోహ్రాస్ నగర్, కర్వాల్ నగర్, లక్ష్మీనగర్ లో 15మంది చొప్పున అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక.. పటేల్ నగర్, కస్తూర్బా నగర్లలో అత్యల్పంగా కేవలం ఐదుగురు అభ్యర్థులు మాత్రమే పోటీ చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మొత్తం 70 నియోజకవర్గాలు ఉండగా.. 38చోట్ల 10మంది కన్నా తక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. తిలక్ నగర్, మంగోల్ పురి, గ్రేటర్ కైలాస్ సీట్లలో ఆరుగురు చొప్పున, చాందినీ చౌక్, రాజేంద్రనగర్, మాలవీయ నగర్లలో ఏడుగురు చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు.
ప్రచారంలో ముందున్న బీజేపీ..
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రుల కుమారులైన బీజేపీకి చెందిన పర్వేష్‌వర్మ (సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు), కాంగ్రెస్‌కు చెందిన సందీప్ దీక్షిత్ (షీలా దీక్షిత్ కుమారుడు) న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్‌తో తలబడుతున్నారు. ఇక ఢిల్లీ సీఎం ఆతిషీ, మాజీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియా ఈసారి కొత్త స్థానాల్లో తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. ప్రచారంలో బీజేపీ ముందుండగా, నిధుల కొరతతో ఆప్ ప్రచారంలో కాస్త వెనుకబడి ఉంది. హంగుబలం, ఆర్ధికబలం పుష్టిగా ఉన్న కమలనాథులకు దీటుగా కేజ్రీవాల్ పార్టీ ముందుకు పోలేకపోతోందని అనలిస్టులు అంటున్నారు.. అప్ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్ధులు స్థానిక ప్రజలు ఇస్తున్న విరాళాలతోనే ప్రచారపర్వాన్ని కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.