Tuesday, November 26, 2024

ఢిల్లీలో 2డిగ్రీల‌కంటే త‌క్కువ ఉష్ణోగ్ర‌త‌లు.. మ‌రో 24గంట‌ల వ‌ర‌కు ఇదే ప‌రిస్థితి

ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్ర‌త‌లు 2డిగ్రీల కంటే త‌క్కువ‌గా న‌మోద‌వుతున్నాయి. విపరీతంగా పెరుగుతున్న చలిగాలులు కారణంగా.. ఢిల్లీలో నిరాశ్రయుల కోసం షెల్టర్‌లు ఏర్పాటు చేశారు. ఢిల్లీ వ్యాప్తంగా 197 శాశ్వత షెల్టర్‌ హోమ్‌లు ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ అర్బన్‌ షెల్టర్‌ ఇంప్రూమెంట్‌ బోర్డ్‌ సభ్యుడు విపిన్‌ రాయ్‌ తెలిపారు. చలికాలంలో ఢిల్లీలో దాదాపు 250 టెంట్లు వేసినట్లు చెప్పారు. అదేవిధంగా నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ చేశామని.. భోజన సదుపాయం కల్పించినట్లు పేర్కొన్నారు. కాగా శుక్ర‌వారం నైరుతి ఢిల్లీలోని ఆయానగర్‌లో ఉష్ణోగ్రతలు 1.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. సఫ్దర్‌జంగ్‌లో 4.0 డిగ్రీలుగా నమోదైనట్లు పేర్కొంది.

ఆయా నగర్‌లో 1.8 డిగ్రీల సెల్సియస్‌, రిడ్జ్‌లో 3.3 డిగ్రీలు, లోధి రోడ్డులో 3.8 డిగ్రీలు, జఫ్రాపూర్‌ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 3.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. మరోవైపు తీవ్రమైన చలి కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. పలువురు రోడ్లపై చలిమంటలు వేసుకుని చలినుంచి ఉపశమనం పొందుతున్నారు. తీవ్రమైన చలిగాలులు, దట్టమైన పొగమంచు కారణంగా విజబిలిటీ చాలా తక్కువగా ఉంది. దూరంలోని వాహనాలు కనిపించలేని పరిస్థితి నెలకొంది. దీంతో రోడ్డు, రైలు, విమాన మార్గాల్లోని రాకపోకపలై తీవ్ర ప్రభావం పడుతోంది. ఢిల్లీలో సుమారు 26 రైళ్లు గంట నుంచి 10గంటల మేర ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. మరో 24 గంటల వరకు ఇలాంటి పరిస్థితులే ఉండొచ్చని ఐఎండీ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement