తొమ్మిది అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 85 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఢిల్లీ ద్వారకా ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై ఢిల్లీ ప్రభుత్వం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబానికి రూ.లక్ష నష్టపరిహారం ప్రకటించింది. ద్వారకా ప్రాంతంలో ఉన్న తొమ్మిది అంతస్తుల భవనంలో శనివారం ఒక్క సారిగా గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు మొదలయ్యాయి. ఇవి వేగంగా పై అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంపై స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. దీంతో వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
కొన్ని గంటల పాటు సిబ్బంది ఎంతో శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అప్పటికే మంటలు చెలరేగడంతో భవనానికి తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే గుర్తుతెలియని 85 ఏళ్ల వృద్ధుడు భవనం పై అంతస్తులో ఇరుక్కుపోయాడు. మంటలతో ఏర్పడిన వేడిని తట్టుకోలేక, పొగ పీల్చడం వల్ల ఆయన మృతి చెందాడు. ఈ అగ్నిప్రమాదంలో పలువురు గాయాలు కూడా అయ్యాయి. కాగా.. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఏంటో ఇంకా తెలియరాలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చని అధికారుల ప్రాథమికంగా భావిస్తున్నారు. అగ్నిప్రమాదంపై ఢిల్లీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.