Tuesday, November 26, 2024

Delhi : ర‌క్త‌దానం కోసం .. 21వేల కిలోమీటర్ల పాద‌యాత్ర‌

ర‌క్త‌దానం ప్రాముఖ్య‌త‌ని తెలియ‌జేసేందుకు న‌డుం బిగించాడు కిర‌ణ్ వ‌ర్మ‌. ఇత‌ని వ‌య‌సు 38ఏళ్లు. ఢిల్లీకి చెందిన వ‌ర్మ 2021 ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా తన పాదయాత్రను మొదలు పెట్టాడు. ఎన్నో గ్రామాల్లో పర్యటిస్తూ 27,000 మంది రక్తదానం చేసేలా స్ఫూర్తినిచ్చాడు. 2016లో జరిగిన ఓ ఘటన కిరణ్ వర్మ గమ్యాన్ని మార్చివేసిందట‌. ఓ అపరిచితుడి నుంచి అతడికి కాల్ వచ్చింది. ఛత్తీస్ గఢ్ లో ఓ పేద కుటుంబానికి రక్తదానం కావాలన్న అభ్యర్థన అది. వెంటనే వెళ్లి రక్తదానం చేశాడు. తాను దానం చేసిన రక్తానికి ఆ నిర్భాగ్య కుటుంబం నుంచి ఆసుపత్రి రూ.1,500 వసూలు చేసినట్టు తెలుసుకుని, ఎంతో బాధపడ్డాడు. డబ్బు లేకపోవడంతో తన భర్తను బతికించుకునేందుకు ఆ ఇల్లాలు వ్యభిచారం చేయాల్సి వచ్చినట్టు తెలుసుకున్న కిరణ్ వర్మ చలించిపోయాడు. దాంతో ఉద్యోగం మానేసి ఉచిత రక్తదానం కోసం పని చేయాలని నిర్ణయించుకున్నాడు. ఉద్యోగం మానేసిన తర్వాత వచ్చిన మొత్తంలో ‘సింప్లీ బ్లడ్’ అనే ఆండ్రాయిడ్ యాప్, వెబ్ సైట్ మొదలు పెట్టాడు. రక్తదానం కోసం వేచి చూస్తూ ఎవరూ చనిపోకూడదు. ప్రాణం నిలబెట్టేందుకు రక్తమే ఎదురు చూడాలి అన్న సంకల్పంతో ముందుకు సాగాడు. మరో ఘటన కిరణ్ వర్మ సంకల్పాన్ని మరింత బలపడేలా చేసింది.

ఢిల్లీ ఎయిమ్స్ లో మయాంక్ అనే ఓ యువకుడి కోసం 2017 జూన్ 12న రక్తదానం చేశాడు. యూపీకి చెందిన సదరు ఇంజనీరింగ్ విద్యార్థి అనారోగ్యంతో ఎయిమ్స్ లో చేరాడు. రక్తదానం తర్వాత మయాంక్ తో కలసి వర్మ కొన్ని ఫొటోలు తీసుకున్నాడు, వీడియో కూడా తీసి ప్రచారం కల్పించేందుకు వినియోగించాడు. రెండు నెలల తర్వాత మయాంక్ తండ్రి వర్మకు కాల్ చేశాడు. ప్లేట్ లెట్లు లభించకపోవడంతో తన కుమారుడు చనిపోయాడని, నాడు అతడితో తీసుకున్న ఫొటోలు షేర్ చేయాలని కోరడంతో వర్మ గుండె పిండేసినంత పని అయింది. మయాంక్ మాదిరిగా మరొకరు చనిపోకూడదని వర్మ అనుకున్నాడు. 2018లో కిరణ్ వర్మకు కుమారుడు జన్మించాడు. అనంతరం వర్మ రక్తదాన ఉద్యమాన్ని మొదలు పెట్టాడు. మొత్తం 16,000 కిలోమీటర్ల పొడవునా ప్రయాణించి రక్త దానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో 6,000 కిలోమీటర్లు నడక రూపంలో వెళ్లాలన్నది అతడి నిర్ణయం. కరోనా కారణంగా మధ్యలో నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో తిరిగి 2021లో ప్రపంచ రక్తదానం దినం సందర్భంగా 21,000 కిలోమీటర్ల నడకను వర్మ మొదలు పెట్టాడు. ఇప్పటి వరకు 12 రాష్ట్రాలు, 169 జిల్లాల్లో అతడి యాత్ర సాగింది. భారత్ తో పాటు బంగ్లాదేశ్ లోనూ పర్యటించాడు. ఇప్పటి వరకు 12,000 కిలోమీటర్ల యాత్రను పూర్తి చేశాడు. ఈ నెల 12 నాటికి 500 రోజుల నడకను పూర్తి చేసుకున్నాడు. భారత్ లో పర్యటన తర్వాత ఇతర దేశాల్లోనూ రక్తదానంపై ప్రచారం కల్పించాలన్నది అతడి ఆలోచ‌న‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement