Tuesday, November 26, 2024

ఈ-ల్యాబ్ అమ‌లులో ఆల‌స్యం.. ప్రోత్సాహ‌క బెనిఫిట్స్ అంద‌క‌ డెయిరీ రైతులకు ఇబ్బందులు

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని పాడి రైతులకు ఆర్ధికంగా ప్రయోజనాన్ని చేకూర్చేందుకు ప్రభుత్వం ప్రోత్సాహక నిధులను ప్రవేశపెట్టింది. దీని అమలు పారదర్శకంగా ఉండేందుకు ఈ-ల్యాబ్‌ను ప్రత్యేకంగా తయారుచేసి ఆవిష్కరించారు. రైతులకు ప్రభుత్వం అందించే ఇన్సెంటివ్‌ క్లియరెన్స్‌లో ఆలస్యం జరుగుతుండగా, దానికి అవసరమైన ఈ-ల్యాబ్‌ ప్రస్తుతం అటకెక్కింది. ఈ-ల్యాబ్‌లో నమోదైన రైతులకే ప్రోత్సాహక నిధులు అందేలా అందులో నిబంధనను తీసుకురావడంతో ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా మంది రైతులకు 2016 నుంచి ఇన్సెంటివ్‌ అందడం లేదు. అయితే ఇది ఒక్క విజయ డెయిరీకి పాలు పోసే రైతులకే కాకుండా విజయ డెయిరీతో అనుబంధంగా నడిచే నార్మూల్‌, కరీంనగర్‌, ముల్కనూరు డెయిరీల్లోని రైతులకు ప్రోత్సాహక నిధులు అందడంలేదు. ఏళ్లు గడుస్తున్నా.. ప్రోత్సాహక నిధులు అందడంలేదని రైతులు వాపోతున్నారు.

అసలు ఈ-ల్యాబ్‌ అంటే..

తెలంగాణలోని విజయ డెయిరీతో పాటు ఇతర డెయిరీలకు పాలు పోసే రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ఇన్సెంటివ్‌ నేరుగా రైతులకే అందేలా , పూర్తి పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో విజయ డెయిరీతో కలిసి 2016లో ఈ-ల్యాబ్‌ను తీసుకొచ్చాయి. ఆవిష్కృతం చేసే వరకు బాగానే ఉన్నా దాని అమల్లో మాత్రం తీవ్ర జాప్యం కనబడుతోంది. వాస్తవంగా ఈ-ల్యాబ్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పాలు పోస్తున్న రైతులు, పోయని రైతులను గుర్తించి వారిని పోర్టల్‌లోకి నమోదు చేస్తూ చేర్పులు, మార్పులు చేయాల్సి ఉంటుంది. అధికారుల నిర్లక్ష్యంతో ప్రారంభమైన ఏడాది మినహా ఇప్పటివరకు చాలా మంది రైతులు పోర్టల్‌లో నమోదుకాలేదు. ఈ-ల్యాబ్‌లో పాలు పోసే రైతులకు సంబంధించిన బ్యాంకు ఎకౌంటు వివరాలతో పాటు రైతుల పూర్తి వివరాలను నమోదు చేస్తారు. దీని ద్వారా ప్రభుత్వం విడుదల చేసే మధ్యవర్తితో సంబంధం లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమ అవుతుంది. కానీ అధికారులు ఏళ్ల తరబడి ఈ-ల్యాబ్‌ను పట్టించుకోకపోవడంతో రైతులకు ఇన్సెంటివ్‌ అందడం లేదు.

5ఏళ్ల నుంచి అందని ప్రోత్సాహక నిధులు..

పోర్టల్‌లో నమోదు కాకపోవడంతో సుమారు 5ఏళ్ల నుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ప్రోత్సాహక నగదు అందని రైతులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కాగా ప్రస్తుతం విజయ డెయిరీకి పాలుపోసే రైతులు సుమారు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఉన్నారని అధికారులు చెబుతుండగా, పోర్టల్‌లో మాత్రం కేవలం 90వేల మంది మాత్రమే నమోదు అయ్యారని తెలుస్తోంది. కాగా కరీంనగర్‌, నార్మూల్‌, ముల్కనూరు డెయిరీల రైతులు ఎంతమంది నమోదు అయ్యారు, ఎంతమందికి ఎప్పటి నుంచి నిధులు అందడంలేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకు సంబంధించి జనగామ జిల్లాలోని చిల్పూరు మండలం కృష్ణాజీగూడెంలో ఇప్పటికి 40మంది ఈ-ల్యాబ్‌లో నమోదుకాలేదు.

- Advertisement -

అధికారుల నిర్లక్ష్యం..రైతులకు శాపం..

విజయ డెయిరీ అధికారుల నిర్లక్ష్యంతో పాడిరైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వాస్తవానికి ప్రభుత్వం, పశుసంవర్ధక శాఖలు రైతులకు అందించాల్సిన నిధులను ఎప్పటికప్పుడు డెయిరీకి అందజేస్తున్నా.. ఆ నిధులను రైతులకు అందించడంలో మాత్రం అధికారులు జాప్యం చేస్తున్నారని, దీంతో పాటు నిధులు అందేందుకు అవసరమైన ఈ-ల్యాబ్‌ అమల్లోనూ అలసత్వం ప్రదర్శిస్తూ రైతులకు అందాల్సిన ఇన్సెంటివ్‌ను సమయానికి అందించడంలేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అర్హులైన పాడి రైతులను గుర్తించి ఈ-ల్యాబ్‌లో నమోదు చేసి ఇన్సెంటివ్‌ అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement