Tuesday, November 12, 2024

సెంట్రల్ వర్సిటీల్లో ప్రవేశాలకు వీలుగా జూన్‌లో డిగ్రీ పరీక్షలు.. మేలో సీపీగెట్‌ నోటిఫికేషన్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని సాంప్రదాయ డిగ్రీ కోర్సులను అందిస్తున్న ఆరు యూనివర్సిటీల్లో జూన్‌ చివరి కల్లా డిగ్రీ చివరి సెమిస్టర్‌ పూర్తి చేసి, విద్యార్థులకు మెమో జారీ చేసేలా తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్‌ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్స్‌ (సీపీగెట్‌) నోటిఫికేషన్‌ను మే మొదటి లేదా రెండో వారంలో విడుదల చేయాలని ఈ మేరకు అధికారులు నిర్ణయించారు. ప్రవేశ పరీక్షలను ఆగస్టులో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో లాగే సీపీగెట్‌ నిర్వహణ బాధ్యతను ఉస్మానియా యూనివర్సిటీకే అప్పగించగా, కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ పాండురంగారెడ్డి వ్యవహరించనున్నారు.

మాసాబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ ఉన్న ఉన్నత విద్యామండలిలో శనివారం నిర్వహించిన వైస్‌చాన్స్‌లర్ల సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌. లింబాద్రి, వైస్‌చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి. వెంకటరమణ, ఓయూ, కేయూ, పాలమూరు, శాతవాహన, మహాత్మాగాంధీ, తెలంగాణ వర్సిటీల వీసీలు ప్రొఫెసర్‌ రవీందర్‌యాదవ్‌, ప్రొఫెసర్‌ తాటికొండ రమేష్‌, ప్రొఫెసర్‌ లక్షీకాంత్‌ రాథోడ్‌, ప్రొఫెసర్‌ మల్లేశ్‌, ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డి, ప్రొఫెసర్‌ డీ. రవీందర్‌లు హాజరయ్యారు. కామన్‌ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్స్‌(సీపీగెట్‌) సహా న్యాక్‌ అక్రిడిటేషన్‌, పరీక్షలను త్వరగా పూర్తిచేయడంపై చర్చించిన అధికారులు పలు నిర్ణయాలు తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement