Friday, November 22, 2024

గ్రూప్‌-1 నోటిఫికేషన్‌పై నేడు నిర్ణయం.. నేడో, రేపో ప్రకటన వెలువడే చాన్స్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ప్రకటనపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు గ్రూప్‌-1 నోటిఫికేషన్‌పైన టీఎస్‌పీఎస్సీ కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈసమావేశంలో నోటిఫికేషన్‌ విడుదలపై నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశానంతరం లేదా, రేపు ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌పై ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ అధికారులు పలు మార్లు సమావేశాలు నిర్వహించి ప్రకటన విడుదలపై ఓ అంచనాకు వచ్చినట్లుగా తెలిసింది. అయితే ఈ రోజు చివరిసారిగా సమావేశం నిర్వహించి ఉద్యోగ ప్రకటనను వెలువరించనున్నట్లుగా సమాచారం. ఈనెల 18 లేదా 20వ తేదీనే గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను విడుదల కావాల్సి ఉన్నా ప్రభుత్వం ఇంటర్య్వూలు రద్దు చేయడం, మార్కుల అంశంలో నిర్ణయం తీసుకోవడంతో పాటు కొన్ని శాఖల నుంచి వివరాలు అందాల్సి ఉండడంతో వాయిదా పడింది.

అదేవిధంగా కొత్త జోనల్‌ వ్యవస్థ నేపథ్యంలో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా, నోటిఫికేషన్‌ ప్రక్రియ సాఫీగా జరిగేందుకు ముందు నుంచి టీఎస్‌పీఎస్సీ ఆచితూచి అడుగులు వేస్తోంది. నోటిఫికేషన్‌ జారీలో కాస్త ఆలస్యమైనా పర్వాలేదు కానీ, రిజర్వేషన్లు.. రోస్టర్‌ విధానం లాంటి చిక్కులు తలెత్తకుండా అభ్యర్థులెవరూ తమకు అన్యాయం జరిగిందని కోర్టు మెట్లు ఎక్కకుండా అందరికీ న్యాయం జరిగేలా ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ కారణాలతోనే ఏప్రిల్‌ మొదటి వారంలో వెలువడాల్సిన నోటిఫికేషన్‌ వాయిదాపడుతూ వస్తోంది. అన్ని అంశాలు దాదాపు కొలిక్కిరావడంతో ఈ రోజు చివరిసారిగా టీఎస్‌పీఎస్సీ సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం లేదా ఒకట్రెండు రోజుల్లో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ప్రకటనను అధికారులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఎనిమిదిలోపు ప్రక్రియ పూర్తి…
ఉద్యోగ ప్రకటన అంటే సాధారణంగా ఉద్యోగార్థుల్లో ఒక రకమైన అభిప్రాయం ఉంది. టీఎస్‌పీఎస్సీ నుంచి గ్రూప్‌-1, 2, 3, 4 లాంటి ప్రకటన వెలువడిందంటే అది పూర్తవడానికి దాదాపు రెండు మూడు ఏళ్లు పడుతుందనే అభిప్రాయం అభ్యర్థుల్లో ఉంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఏదోక అంశంపై కోర్టు కేసులతో భర్తీ ప్రక్రియ ఆలస్యమవుతూ ఉండేది. ఈసారి ఎలాంటి చిక్కులు, కోర్టు కేసులు లేకుంటే ఎక్కువలో ఎక్కువ ఏడాదిలోపు పోస్టుల భర్తీని పూర్తి చేసేలా టీఎస్‌పీఎస్సీ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.

నోటిఫికేషన్‌ వెలువడిన కాన్నుంచి 30 నుంచి 40 రోజుల వరకు దరఖాస్తు ప్రక్రియను చేపట్టాలని భావిస్తున్నారు. ఇప్పుడు ఇంటర్వ్యూలను కూడా ఎత్తేయడంతో వీలైనంత త్వరగా ఫలితాలను ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఏమైనా చిన్న చితకా కోర్టు కేసులు, చిక్కులు ఏమైనా తలెత్తితే వాటిని పరిష్కరించుకొని ఏడాదిలోపు భర్తీ ప్రక్రియను ముగించేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. ఈమేరకు పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి వంటి విషయంలో టైమ్‌టేబుల్‌ను ఫైనల్‌ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే గ్రూప్‌-1లోని 503 పోస్టులకు సంబంధించి ఆయా శాఖల నుంచి వివరాలను సేకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement