దేశంలో మరో కొవిడ్ టీకా అందుబాటులోకి రానుంది. రష్యాకు చెందిన గమలేయా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, రష్యా ప్రత్యక్ష పెట్టుబడి నిధి (ఆర్‌డీఐఎఫ్) సంస్థలు అభివృద్ధి చేసిన స్పుత్నిక్ లైట్ టీకా అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) ఆదివారం ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతివ్వాలంటూ.. సెంట్రల్ డ్రగ్ అఽథారిటీ నిపుణుల బృందం డీసీజీఐకి గత వారం సిఫార్సు చేసింది. ఈ మేరకు డీసీజీఐ అంగీకారం తెలిపింది. దేశంలో కొవిడ్ నిరోధానికి అనుమతులు లభించిన 9వ టీకాగా స్పుత్నిక్ లైట్ నిలవనుంది.
అయితే, ఇది సింగిల్ డోసు టీకా. అంతేగాక సార్వజనీన బూస్టర్ డోసుగానూ ఇవ్వొచ్చు. అంటే, గతంలో ఏ టీకా రెండు డోసులు తీసుకున్నా.. స్పుత్నిక్ లైట్‌ను బూస్టర్‌గా వాడొచ్చు. కాగా, భారత్‌లో స్పుత్నిక్ టీకాల పంపిణీలో డాక్టర్ రెడ్డీస్ సంస్థ ఆర్‌డీఐఎఫ్ కు భాగస్వామిగా వ్యవహరిస్తున్నది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో స్పుత్నిక్ వి టీకా భారత్ లోకి వచ్చింది. ఇప్పటివరకు ప్రైవేట్ ఆసుపత్రులలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది దేశంలో అతి తక్కువగా వినియోగిస్తున్న కోవిడ్ 19 వ్యాక్సిన్. దేశంలో ఇప్పటివరకు అందించబడిన 169 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లలో కేవలం 12 లక్షల డోస్‌లు స్పుత్నిక్ వి టీకాలు మాత్రమే ఉన్నాయి. స్పుత్నిక్ లైట్ 30 పైగా దేశాల్లో వినియోగంలో ఉంది.
మరోవైపు దేశంలో ఇటీవల భారీగా పెరిగిన కరోనా, ఒమిక్రాన్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నట్లు వైద్య నిపుణులు భావిస్తున్నారు. టీకా తీసుకోవడం, తప్పనిసరిగా మాస్కు ధరించడం, అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఎవరికివారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. టీకాల నుంచి వంద శాతం రక్షణ లభించదు. కానీ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న టీకాలతో ప్రాణాపాయం తప్పుతోంది. టీకా తీసుకున్న వారికి వ్యాధి సోకినా, దాని తీవ్రత తక్కువగా ఉంటుంది.