– డిజిటల్ మీడియా, ఆంధ్రప్రభ
కొవిడ్-19కి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటానికి నాసల్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం అతిపెద్ద ప్రోత్సాహమని కేంద్ర మంత్రి డాక్టర్ మాండవీయ అన్నారు. 18 ఏళ్లు దాటిని వారికి నాజల్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు డీసీజీఐ అనుమతించిందని తెలిపారు. ఈ మేరకు దీని గురించి ట్వీట్ చేశారు. కాగా భారత్‌లో అనుమతి పొందిన తొలి ఇంట్రానాసల్ కోవిడ్ టీకాగా భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్ నిలిచింది. ఇప్పటికే భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.
నాసల్ వ్యాక్సిన్‌కు సంబంధించి దాదాపు 4000 మంది వలంటీర్లపై భారత్ బయోటెక్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. ఇందులో ఎవరిలోనూ ఎలాంటి ప్రతికూల ప్రభావాలు కనిపించలేదని వెల్లడించింది. ఈ టీకా పూర్తిగా సురక్షితమైనదని, వ్యాధినిరోధక శక్తిని సమర్థవంతంగా ప్రేరేపిస్తుందని గత నెలలో వెలువరించిన మూడోదశ ప్రయోగ ఫలితాల సందర్భంగా భారత్ బయోటెక్ పేర్కొంది. ప్రయోగాల్లో భాగంగా ఈ నాసల్ టీకాను ప్రైమరీ వ్యాక్సిన్‌గానూ, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి బూస్టర్‌గానూ ఇచ్చామని, మెరుగైన ఫలితాలు వచ్చాయని కంపెనీ తన ప్రకటనలో తెలిపింది.
ఇక.. కొద్దిపాటి మార్పులు చేసిన చింపాంజీ అడినోవైరస్ వెక్టార్ సాయంతో ఈ టీకాను అభివృద్ధి చేసినట్లు సంస్థ తెలిపింది. సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ప్రత్యేకంగా టీకా అభివృద్ధి చేసినట్లు వివరించింది. ఈ టీకాను నాసికా రంధ్రాల ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది.
ఎంతో గర్వంగా ఉంది: కృష్ణాఎల్లా
ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతులు మంజూరు కావడంపై భారత్ బయోటెక్ సంస్థ ఎండీ కృష్ణా ఎల్లా సంతోషం వ్యక్తంచేశారు. గ్లోబల్ గేమ్ ఛేంజర్ అయిన తమ చుక్కల మందు ఇన్‌కోవాక్‌కు అనుమతులు లభించడంపై గర్వంగా ఉందన్నారు. భవిష్యత్‌లో సంభవించే అంటు వ్యాధులను ఎదుర్కొనేందుకు నాసల్ వ్యాక్సిన్ అభివృద్ధిని కొనసాగిస్తామని చెప్పారు. వ్యాక్సిన్ అభివృద్ధికి సహకరించిన కేంద్ర ఆరోగ్యశాఖ, సీడీఎస్‌సీవో, డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాషింగ్టన్ యూనివర్సిటీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.