స్పీడ్ యుగంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే మానేశారు. ఎప్పుడూ ఫోన్లలోనే తలమునకలవుతూ.. బిజీబిజీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. కొంతమంది తమ పర్సనల్ వ్యాపకాలను తీర్చుకునేందుకు డేటింగ్ యాప్ లలో అమ్మాయిలను కాంటాక్ట్ అవుతుంటే.. ఇంకొందరు వర్చువల్ గా డేటింగ్ చేస్తూ.. తమ కోరికలను తీర్చుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డేటింగ్ అనేది కామన్ అయ్యింది. అయితే ఒకతను మాత్రం వరుసపెట్టి ఆడాళ్లతో డేటింగ్ చేస్తున్నాడు.. 109 ఏళ్ల బామ్మను కూడా వదల్లేదు.. దానికి అతను చెబుతున్న రీజన్ ఏంటో చదవి తెలుసుకుందాం..
అతని టార్గెట్ 365 మంది మహిళలతో డేటింగ్ చేయడం. ఇప్పటివరకూ 335 మంది మహిళలతో డేటింగ్ చేసిన అతను మరో 30మంది మహిళలతో డేటింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. సాధారణంగా డేటింగ్ అనగానే రొమాంటిక్ లేదా శృంగారపరమైన రిలేషన్‌షిప్ అనే ఆలోచన చాలామందికి వస్తుంది. కానీ, అతని ఆలోచన వేరు. అతను ప్రేమ కోసమో లేదా తన జీవిత భాగస్వామిని వెతుక్కోవడానికో ఈ సీరియల్ డేటింగ్ చేయట్లేదు. ఇంతకీ ఎవరా వ్యక్తి.. ఏంటతని అసలు ఉద్దేశం.. ఇది తెలుసుకోవాలని చాలా మందికి ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది కదూ.. ఈ స్టోరీ పూర్తి చదివేయండి..
తమిళనాడుకు చెందిన యాక్టర్, ప్రొఫెషనల్ డ్యాన్సర్, ఫోటోగ్రాఫర్ అయిన సుందర్ రామ్ 365 మంది మహిళలతో డేటింగ్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నాడు. అతను చాలా సంవత్సరాలుగా తన టార్గెట్ రీచ్ కావడానికి సీరియస్ గానే ట్రై చేస్తున్నాడు. అయితే ఇప్పటికైతే 335 మంది మహిళలతో డేటింగ్ చేశాడు. మరో 30 మందితో డేటింగ్ కంప్లీట్ చేస్తే అతని టార్గెట్ పూర్తవుతుంది. అయితే అతనికి ఈ ఆలోచన ఎట్లా వచ్చిందనేగా మీరు అనుకుంటున్నది..
తన భార్యతో విడాకులు తీసుకున్న సుందర్ ప్రస్తుతానికి డేటింగ్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టాడు. ‘‘నేను పక్కా రొమాంటిక్. నిత్యం ప్రేమ కోసం అన్వేషిస్తాను. అయితే నేను 365 మంది మహిళలతో డేటింగ్ చేయాలన్న ఉద్దేశం వేరు. దేశంలో మహిళా హక్కుల పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం కోసమే దీన్ని ఎంచుకున్నా.’’ అని సుందర్ రామ్ తెలిపారు.
టర్నింగ్ పాయింట్ ఏంటంటే..
దాదాపు పదేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన.. సుందర్ రామ్ ప్రయాణాన్ని అనుకోని మలుపు తిప్పింది. అప్పటిదాకా సినిమాల్లో నటుడిగా, మోడల్‌గా తన పనేదో తాను చేసుకుంటున్న సుందర్… ఈ ఘటనతో చలించిపోయాడు. ఆ ఘటనతో తన కడుపు రగిలిపోయిందని… చాలా రాత్రులు నిద్ర కూడా పోలేదని సుందర్ చెబుతున్నాడు. ‘‘నేను విదేశాలకు వెళ్లినప్పుడు చాలామంది ఎందుకు మీ ఇండియన్స్ మహిళల పట్ల అలా ప్రవర్తిస్తారని అడిగేవారు. మనమెప్పుడూ ఎలా ఆలోచిస్తామంటే… ఇదేదో ప్రభుత్వం చూసుకునే వ్యవహారమని.. లేక ఎన్జీవోల బాధ్యత అని అనుకుంటాం. కానీ ఈ పరిస్థితిలో మార్పు కోసం నావంతుగా నేనేమి చేయగలనని ఆలోచించాను.’’ అని సుందర్ తెలిపారు. ఆ ఆలోచనల్లో నుంచే 365 మంది మహిళలతో డేటింగ్ అనే కాన్సెప్ట్ పుట్టుకొచ్చిందన్నారు.
తనవంతు ఏదైనా చేయాలనే…
‘‘స్త్రీలను గౌరవించే వారిని బాగా చూసుకునే కుటుంబంలో నేను పుట్టి పెరిగాను. నేనెళ్లిన స్కూల్లోనూ లింగ వివక్షత ఎక్కడా ఉండేది కాదు. గర్ల్స్, బాయ్స్ ను వేరుగా చూసేవారు కాదు. కానీ, ఎప్పుడైతే నేను బయటి ప్రపంచంలోకి వచ్చానో… లింగ వివక్ష, లింగ అసమానతలు కనిపించాయి.. ఒకరకంగా ఇది నాకొక బిగ్ కల్చరల్ షాక్. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన నన్ను కదలించింది. అందుకే నావంతుగా మహిళల కోసం ఏమైనా చేయాలనుకున్నా.’’ అని సుందర్ రామ్ తెలిపారు.
2014లో డేటింగ్ ప్రాజెక్ట్ మొదలు…
‘‘సమస్య పరిష్కారంలో మగాళ్లు కూడా భాగస్వామ్యం కావాలి. డేటింగ్ పట్ల చాలామంది మగాళ్లలో తప్పుడు అభిప్రాయాలున్నాయి. ఆడాళ్లంటే కేవలం కాళ్లు, ఒంపుసొంపులు కాదు. నా డేటింగ్స్‌లో నా సంభాషణల గురించి రాయడం ద్వారా ఒక విషయం చెబుతున్నా… ఒకసారి మీరు వారి స్థానంలోకి వెళ్లి ఆలోచించండి. అప్పుడే వారి సమస్యలను మీరు అర్థం చేసుకోగలరు.’’ అని సుందర్ అంటారు. డిసెంబర్ 31,2014లో సుందర్ రాము తన డేటింగ్ ప్రాజెక్టును ప్రారంభించాడు. ఏడాది లోగా దీన్ని పూర్తి చేయాలని భావించాడు. కానీ, ఆ మరుసటి ఏడాది చెన్నైలో వరదల కారణంగా తాత్కాలికంగా బ్రేక్ వచ్చింది. ఆ తర్వాతి ఏడాది నుంచి డేటింగ్‌ను మళ్లీ పట్టాలెక్కించాడు.
ప్లే బాయ్ అనే విమర్శల…
ఇప్పటికీ సంప్రాదాయపరంగా తల్లిదండ్రులు చూసిన వివాహాలే దేశంలో ఎక్కువగా జరుగుతుంటాయి. డేటింగ్ అంటే పాశ్చాత్య సంస్కృతిగానే చూస్తారు. దానిపై చాలామందికి చెడు అభిప్రాయాలు కూడా ఉన్నాయి. సుందర్ రాము ఈ ప్రాజెక్టును మొదలుపెట్టినప్పుడు అతన్ని కూడా చాలామంది అదో రకంగా చూశారు. ఒకరకంగా అతనిపై ప్లే బాయ్ ముద్ర వేసే ప్రయత్నం కూడా జరిగింది. కానీ, ఆ విమర్శలు చేసేవాళ్ల నోళ్లు మూయించాడు సుందర్ రాము. ‘‘ఈ డేటింగ్ ఉద్దేశం… ఒక సంభాషణ జరగడం, ప్రశ్నల్లో నుంచి ఎదుటి వ్యక్తి దృక్పథాన్ని అర్థం చేసుకోవడం. అంతిమంగా లింగ సమానత్వం అనేది దీని అసలు ఉద్దేశం.’’ అని సుందర్ రాము చెబుతున్నారు.
ఎవరెవరితో డేటింగ్..
డేటింగ్-365లో భాగంగా ఇప్పటివరకూ 335 మందితో సుందర్ రాము డేటింగ్ చేశాడు. ఇందులో అతని నానమ్మ, అతను నివసించే అపార్ట్ మెంట్‌లో చెత్త ఏరే మహిళ, 90ఏళ్ల ఓ ఐరిష్ బామ్మ, ఒక నటి, పలువురు మోడల్స్, ఓ యోగ టీచర్, ఉద్యమకారులు, రాజకీయ నేతలు తదితరులున్నారు. అలాగే వియత్నాం,స్పెయిన్, ఫ్రాన్స్, అమెరికా, థాయిలాండ్, శ్రీలంక ఇట్లా చాలా దేశాలకు చెందిన మహిళలున్నారు. మొదటి 12 డేట్స్ తనకు తెలిసినవాళ్లతోనే చేశాడు. సుందర్ తన పదో డేట్‌లో ఉన్నప్పుడు… స్థానిక మీడియా అతనిపై కథనం ప్రసారం చేసింది. ‘‘డేటింగ్ కింగ్’’ అని,‘‘ది 365 డేట్స్ మ్యాన్’’ అని,‘‘సీరియల్ డేటర్’’ అని ఇలా రకరకాలుగా అతన్ని అభివర్ణించింది. అలా సుందర్ రామ్ చేస్తున్న ప్రాజెక్టు గురించి అప్పుడే బయటి ప్రపంచానికి తెలిసింది.
109 ఏళ్ల బామ్మతో స్పెషల్ డేటింగ్..
ఇప్పటివరకూ ఎంతోమందితో డేటింగ్ చేసినా109 ఏళ్ల తన బామ్మతో చేసిన డేటింగ్ తనకెంతో ప్రత్యేకమని సుందర్ చెబుతుంటాడు. మూడేళ్ల క్రితం ఆమె చనిపోయారు.‘‘మా నానమ్మకు మెర్సిడెజ్ బెంజ్‌లో షికారుకు వెళ్లాలని ఉండేది. ఎప్పుడూ నాతో ఆ మాట చెబుతుండేది. నా డేటింగ్ ప్రాజెక్ట్ ప్రారంభించాక… ఒకరోజు మెర్సిడెజ్ బెంచ్ కారులో ఆమెను తన స్వస్థలం కుల్లంచవేదికి తీసుకెళ్లాను. 22 ఏళ్లుగా కేవలం ఓటు వేసేందుకు తప్ప ఎన్నడూ బయటకెళ్లని ఆమెను అలా మెర్సిడెజ్‌లో బయటకు తీసుకెళ్లడం సంతోషమనింపించింది. ఇప్పటివరకూ ఎంతోమంది అందమైన అమ్మాయిలతో ఉచితంగా భోజనం చేశాను. ఇప్పుడిది నాకు జీవితకాల ప్రాజెక్టులా మారింది. ఎక్కడో దగ్గర మార్పు మొదలవ్వాలని నేను నమ్ముతాను. రాత్రికి రాత్రే జెండర్ ఈక్వాలిటీ సాధ్యం కాదు. దీన్ని సాధించాలంటే మరికొన్ని తరాలు పట్టవచ్చు. కానీ, మన జీవిత కాలంలో దాన్ని ఆచరణలో పెట్టాలి.’ అని సుందర్ చెప్పుకొచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..