హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లో అభివృద్ధికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అడ్డుపడుతున్నాడని, ఆయకు దమ్ముంటే, చేతనైతే మునిసిపల్ మంత్రిగా తనపై కేసులు పెట్టాలని ఇంజనీర్లు, చిన్నచితకా కార్మికులపై కాదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. మంగళవారం కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఖైతలాపూర్‌లో అత్యంత కీలకమైన ఐటీ కారిడార్‌లోని రోడ్ ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ)ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు.
‘‘దురదృష్టం ఏంటంటే మనమేమో కొత్త రోడ్లు వేస్తున్నం. కొత్త ఫ్లై ఓవర్లు కడుతున్నం. కొత్త అండర్‌పాస్‌లు కడుతున్నం. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నం. వారికి ట్రాఫిక్ బాధలు తప్పాలే కాలుష్యం ఇబ్బందులు తప్పాలే అని చూస్తున్నం. దురుదృష్టం… ఐడీపీఎల్ రోడ్డు వేయాలంటే పోలీసు కేసులు పెట్టండి… ఎట్ల వేస్తరో చూస్తం అని ఇక్కడి నుంచి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న పెద్దాయన అంటుండట. ఆ కేంద్ర మంత్రిగారిని నేను అడుగుతున్నా హైదరాబాద్‌లో మీరు ఎలాగూ పైసా పని చెయ్యరు. మేం పనిచేస్తుంటే పోలీసు కేసులు పెట్టమని ఆదేశాలిస్తున్నటరట. నీకు దమ్ముంటే నీకు చేతనైతే కేసు పెట్టాల్సి వస్తే మునిసిపల్ మంత్రిగా నామీద, ప్రభుత్వం మీద కేసులు పెట్టు.
ఇంజనీర్ల మీద కింద పనిచేసే కార్మికుల మీద చిన్నాచితక పొట్టకూటి కోసం పనిచేసే కార్మికుల మీద కేసులు పెట్టొద్దని ఆ కేంద్ర మంత్రికి చెబుతున్నా. నీకు చేతనైతే ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ దగ్గర నీకు పలుకుబడి ఉంటే కరీంనగర్, రామగుండం, ఆదిలాబాద్ వెళ్లే రహదారుల్లో రక్షణ రంగానికి చెందిన భూములున్నయ్. ఎప్పటినుంచో వాటిని మేం అడుగుతున్నం. మాకు అప్పజెప్పు. అద్భుతంగా స్కైవేలు, ఫ్లై ఓవర్‌లు కట్టి హైదరాబాద్ నగరాన్ని అద్భుతమైన మౌళికసదుపాయాలున్న నగరంగా తీర్చిదిద్దుతం. మంచిపనులు చేస్తుంటే అడ్డుకోవడం కాదు. చేతనైతే సాయం చేయండి. అడ్డురాకండి. ప్రతి దాంట్లో అడ్డం పడడం, అపసవ్యపు కూతలు కూయడం మంచిది కాదు” అని కేటీఆర్ హితవు పలికారు.
దశాబ్దాల కిందట భారతదేశంలో ఔషధాలు తయారు కావాలనే ఉద్దేశంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఐడీపీఎల్ సంస్థను కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిందని కేటీఆర్ తెలిపారు. ఆ సంస్థకు వందల ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచే కారు చౌకగా ఇచ్చినం, ఐడీపీఎల్ ఏర్పాటు చేసిన సమయంలో ఊరవతల ఉండేది. అప్పుడు హైదరాబాద్ చిన్నగా ఎంసీహెచ్ ఉండేది. కానీ తర్వాత పెరుగుతూ పెరుగుతూ భారతదేశంలోనే టాప్ మూడు నగరాల స్థాయికి హైదరాబాద్ విస్తరించింది. ఈ క్రమంలో ఐడీపీఎల్ మధ్యలోకి వచ్చింది. ఐడీపీఎల్ ఊరు మధ్యలోకి వచ్చినందున సహజంగానే దాని చుట్టూ కాలనీలు, బస్తీలు ఏర్పడ్డాయి. దీంతో ఐడీపీఎల్‌లో నుంచి రోడ్డు వేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణన్న కోరార’ని కేటీఆర్ చెప్పారు.
హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎల్‌బీ నగర్ నుంచి కూకట్‌పల్లి వరకు ఎక్కడ చూసినా ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్వోబీలు ఆర్‌యూబీలు, ఒకటి రెండు కాదు రూ.8052 కోట్లతో ఎస్సార్డీపీ తొలిదశలో మొత్తం 47 రకాల పనులు చేపట్టామన్నారు. వీటిలో 30 పనులు ఇప్పటికే పూర్తికాగా మిగిలిన వాటిని వచ్చే ఏడాదిలో హైదరాబాద్ నగర ప్రజలకు అందిస్తామన్నారు. రెండో దశ ఎస్సార్డీపీ పనులను రూ.3115 కోట్ల రూపాయలతో చేపడుతున్నామన్నారు. కూకట్‌పల్లి, కత్బుల్లాపూర్, హైదరాబాద్ పశ్చిమ ప్రాంతాల్లో జన సాంద్రత ఎక్కువగా ఉందని, సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు ఇక్కడ దశలవారిగా మౌళిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ పెద్దలంతా వస్తున్నరట….
ప్రధాని నరేంద్రమోడీ సహా కేంద్రమంత్రులంతా త్వరలో హైదరాబాద్‌కు ఎందుకు వస్తున్నారని కేటీఆర్ కూకట్ పల్లి సభ వేదికగా ప్రశ్నించారు. రాబోయే వారంరోజుల్లో దేశంలో ఉండే పెద్ద పెద్ద నాయకులు ప్రధాని నరేంద్రమోడీ సహా కేంద్ర మంత్రులంతా హైదరాబాద్‌కు వస్తున్నరట. వారందరినీ కూకట్‌పల్లి వేదికగా అడుగుతున్న. ప్రధాని మంత్రి గారు గుజరాత్‌కు పర్యటనకు మీరు వెళ్లినప్పుడల్లా రూ.20 వేల కోట్లతో ప్రాజెక్టులకు శంకుస్థాపన అంటారు.
ఇంకోకాడికి పోతే ఆడో వేలకోట్ల పనులను ప్రకటిస్తారు. మరి అవన్నీ నిజమో అబద్దాలో తెల్వదు. మీరు ఇప్పటివరకు మీరు చెప్పిన మాటల్లో జువ్లూ మాటలు, డొల్ల మాటలు తప్ప నిజాలుండవనే ఇలా అంటున్నా. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో వరదలొస్తే హైదరాబాద్‌కు వెయ్యి పైసలు కూడాఇవ్వలే. అదే గుజరాత్‌లో వరదలు వస్తే మాత్రం ఆఘమేఘాల మీద పోయి వెయ్యి కోట్లు ఇచ్చారు. కానీ హైదరాబాద్ వస్తరంట. హైదరాబాద్‌కు ఎందుకు వస్తున్నరు ఏంచేయడానికి వస్తున్నరు’ అని కేటీఆర్ మండిపడ్డారు.
రామరాజ్యం చేస్తామని చెప్పి… దేశాన్ని రావణ కాష్టంగా మారుస్తున్నరు..
దేశాన్ని రామరాజ్యం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రావణకాష్టంలా మారుస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలో ఏ వర్గంసంతోషంగా లేకంఉడా కులాల మధ్య మతాల మధ్య పంచాయితీలు పెట్టి మతపిచ్చి రేపుతున్నారన్నారు. ఒక వైపు అగ్నిపథ్ అనే పథకాన్ని తీసుకువచ్చి దేశంలోని యువత పొట్ట కొడుతున్నరు. వాళ్లంతా రోడ్లెక్కి ఆందోళన చేస్తుంటే దేశ ద్రోహులని వాళ్లను అవమానిస్తున్నరు. ఇక్కడ ఒకాయన కేంద్ర మంత్రి అంటడు. ఈ అగ్నిపథ్ పథకం మంచిది. అగ్నిపథ్ పథకంలో చేరిన తర్వాత మిలిటరీలో బట్టలు ఉతకొచ్చు. కటింగ్ చేయొచ్చు. ఎలక్ట్రిషియన్ పని చేయొచ్చు. బ్రహ్మాండంగా ఉంటది భవిష్యత్ అంటున్నడు.
దాని కోసం దేశ యువత మిలిటరీలో చేరాలా డ్రైవరయ్యేందుకు, బట్టలు ఉతికేందుకు ఎలక్ట్రిషియన్ అయ్యేందుకు యువత మిలిటరీలో చేరాలా అని కేటీఆర్ ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దని రాత్రికి రాత్రి నోట్ల రద్దు చేస్తే సామాన్యులు తాము బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ముల కోసం చాంతాడ క్యూలలో నిలబడి మూర్చ వచ్చి చచ్చిపోతే పట్టించుకోలేదని కేటీఆర్ గుర్తు చేశారు. నోట్ల రద్దప్పుడు ప్రధాని ఒక్క 50 రోజులు ఓపిక పట్టండి..నల్లధనం తెస్తా అన్నడు. 500 రోజులైంది నల్ల ధనం వచ్చిందా అని ఈ సందర్భంగా కేటీఆర్ నిలదీశారు. జన్‌ధన్ ఖాతాలు తెరిస్తే ఒక్కొక్కరికి రూ.15 లక్షలిస్తానని తర్వాత అది జువ్లూ అని అనడం కేవలం నరేంద్రమోడీకే చెల్లిందని కేటీఆర్ విమర్శించారు.
త్వరలో కొత్త పెన్షన్లు , రేషన్ కార్డులు.. ఇళ్ల వద్దకే వచ్చి ఇస్తాం…
రాష్ట్రంలోని లబ్ధిదారులకు త్వరలోనే కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు ఇస్తామని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కూడా లబ్ధిదారులకు అందిస్తామని కేటీఆర్ తెలిపారు. ఇప్పటివరకు మంచినీటి సదుపాయం, రోడ్లు, కరెంటు తదిరతర మౌళిక సదుపాయాలపై దృష్టి పెట్టామని, ఇక పెన్షన్లు, రేషన్ కార్డులపై దృష్టిపెడతామని చెప్పారు. 57 ఏళ్ల వయసు నిండిన వారందరికీ పెన్షన్లు ఇస్తామన్నారు. ఎవరి దగ్గరికి వెళ్లే అవసరం లేకుండా ఇళ్ల వద్దకే వచ్చి పెన్షన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఈ రాష్ట్రంలో 29 లక్షల మందికి మాత్రమే పెన్షన్ వచ్చేది. రూ.200 మాత్రమే ఇచ్చేవారు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 40 లక్షల మందికి పెన్షన్లు వస్తున్నయ్. రూ.200 పెన్షన్ పెరిగి.. రూ.2 వేలయ్యింది. గతంలో ప్రభుత్వం పెన్షన్ల కోసం సంవత్సరానికి రూ.800 కోట్లు ఖర్చు చేస్తే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏడాదికి రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తోందని కేటీఆర్ తెలిపారు. ఈ సభలో మంత్రి మల్లారెడ్డి, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్, శంభీపూర్ రాజు, సురభివాణిదేవి, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.