భద్రాచలంలో గోదావరి మహోగ్రరూపం కొనసాగుతోంది. దీంతో ప్రమాదకర స్థాయిని మించి నది ప్రవహిస్తున్నది. భారీగా వరద పోటెత్తడంతో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం రికార్డు స్థాయిలో 67 అడుగులకు చేరింది. 22 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నది. అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. మరికొన్ని గంటల్లో గోదావరి నీటిమట్టం 70 అడుగులు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 1976 నుంచి గోదావరి నీటిమట్టం 60 అడుగుల మార్క్‌ను దాటడం ఇది ఎనిమిదోసారి. 30 ఏండ్ల తర్వాత 70 అడుగులకు చేరువైంది. ఇప్పటివరకు రెండు సార్లుమాత్రమే 70 అడుగులు దాటింటి. ఇప్పుడు 75 అడుగులు దాటితే 50 ఏండ్ల రికార్డును అధిగమించినట్లవుతుంది.
వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యగా అధికారులు భ్రదాచలం వంతెనను మూసివేశారు. బ్రిడ్జిపై నుంచి ఎలాంటి వాహనాలను రాకపోకలకు అనుమతించడం లేదు. 1986లో నీటిమట్టం 75.6 అడుగులకు చేరిన సమయంలో మొదటిసారి వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. మళ్లీ 36 సంవత్సరాల భారీగా వరద వస్తుండడంతో ఆంక్షలు విధించారు.
నది తీవ్రరూపం దాల్చడంతో భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో 144 సెక్షన్ విధించారు. ఇప్పటికే భద్రాచలంలోని పలు కాలనీలు వరదలో మునిగిపోయాయి. కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ, సుభాష్ నగర్ కాలనీ, అశోక్ నగర్, శాంతి నగర్ కాలనీ, రామాలయం ప్రాంతంలోని ఇండ్లలోకి నీరు చేరింది. దీంతో నివాసాలను ఖాళీ చేయించి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రాత్రి భద్రాచలంలోనే బసచేశారు. వరద, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ అనుదీప్ స్వయంగా కాలనీలకు వెళ్లి మైకు ద్వారా ప్రజలకు సూచనలు చేస్తున్నారు. బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ లారీ యార్డ్ వద్ద నేషనల్ హైవేపై గోదావరి వరద నీరు చేరడంతో రాకపోకలు కంప్లీట్‌గా ఆగిపోయాయి. దీంతో భద్రాచలానికి వెళ్లే ఒక్క రహదారి బంద్ అయ్యింది. ఇక్కడ పరిస్థితి సాధారణ స్థాయికి వస్తే కానీ రవాణాకు సాధ్యం అవుతుంది.