Thursday, November 21, 2024

సముద్రంలో ఘోరం.. ప‌ర‌స్ప‌రం ఢీకొన్న కార్గో షిప్‌లు..

అరెబియా మ‌హాసముద్రంలో భారీ ప్రమాదం జ‌రిగింది. గుజరాత్‌లోని ద్వారకా జిల్లాలో ఓఖాకు 10 మైళ్ల దూరంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. రెండు విదేశీ కార్గో షిప్‌లు ప‌ర‌స్ప‌రం ఒకదానికొకటి ఢీకొన్నట్టు డిఫెన్స్ మినిస్ట్రీ తెలిపింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రక్షణ శాఖ వ‌ర్గాలు తెలిపాయి. ఆరేబియాలోని గ‌ల్ఫ్ ఆఫ్ క‌చ్‌లో నిన్న (శుక్రవారం) రాత్రి ఎంవీఎస్ ఏవియేట‌ర్‌, అట్లాంటిక్ గ్రేస్ ఓడ‌లు ఒక‌దాన్ని ఒక‌టి ఢీకొన్నాయి.

అయితే ఈ ఘటనలో చ‌మురు లీకేజీ జ‌రిగిన‌ట్టు అధికారులు తెలిపారు. కార్గో షిప్‌లు ఢీకొన్నాయ‌న్న‌ సమాచారం తెలియడంతో ఇండియ‌న్ కోస్ట్‌గార్డ్ షిప్‌లను మోహరించి ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. దీంతోపాటు పొల్యూష‌న్ కంట్రోల్ నౌక‌ను కూడా అక్కడికి పంపించారు. ఢీకొన్న ఓడల ద్వారా ఏమైనా ర‌సాయనాలు స‌ముద్రంలో క‌లిసి ఉంటే ఈ నౌకతో శుభ్రంచేయనున్నారు. రక్షణ చర్యల కోసం కోస్ట్ గార్డ్స్ బృందంతో పాటు పెట్రోలింగ్ షిప్, హెలికాప్టర్‌ను కూడా మోహరించినట్లు రక్షణశాఖ తెలిపింది. ప్రస్తుతం ఓడల్లోని సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement