Friday, November 22, 2024

Danger Bells – ప్రళయం ముంగిట భారత్ – ముంచుకొస్తున్నమౌలిక విపత్తు ..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి

క్లైమేట్‌ రిస్క్‌ అనలైటికల్‌ ఆర్గనైజేషన్‌ అయిన క్రాస్‌ డిపెన్డెన్సీ ఇనిస్టిట్యూట్‌ (ఎక్స్‌డీఐ) ఇటీవల విడుదల చేసిన నివేదికల మేరకు వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు దుర్బలత్వాన్ని ఎదుర్కొంటున్నాయి. 2050 నాటికి అకాల వర్షాలు, వరదలు, భూకంపాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల సంఖ్య ఇప్పటికంటే దాదాపు 20 రెట్లు పెరుగుతుంది. ఈ కారణంగా ప్రపంచంలో 2,639 ప్రాంతాలు తీవ్ర భౌతిక నష్టానికి గురౌతాయి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల్తో
తీవ్ర నష్టాల్నెదుర్కొనే టాప్‌ 50 ప్రాంతాల్లో భారత్‌ 22వ స్థానంలో ఉంది. మన దేశంలోని ఉత్తర్‌ప్రదేశ్‌, అసోం, రాజస్థాన్‌, తమిళనాడు రాష్ట్రాల్లోని మౌలిక సదుపాయాల ు భౌతికంగా తీవ్ర నష్టాలకు లోనౌతాయి. ముఖ్యంగా నద ుల్లో వరదలు పెరుగుతాయి. తీరప్రాంతాల్లోని ఇళ్ళు, వృక్షాలు నేలకూలుతాయి. విపరీతమైన వేడి పుట్టుకొస్తుంది. అడవులు మండుతాయి. నేలల్లో కదలికలేర్పడతాయి. విపరీతమైన గాలి వీస్తుంది. అలాగే చలికి గడ్డకట్టే పరి స్థితి కనిపిస్తుంది. వాతావరణ మార్పుల కారణంగా రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు కూడా తీవ్రంగా దెబ్బతిం టాయి. ఈ గణన కోసం ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ వాతావరణ , పర్యావరణ వివరాల్ని పూర్తిస్థాయిలో సేకరించింది. ఇంజనీరింగ్‌ అర్కిటెక్ట్‌లతో కలిపి నమూనాల్ని రూపొందించింది.

జర్మన్‌ వాచ్‌ థింక్‌ట్యాంక్‌ విడుదల చేసిన గ్లోబల్‌ క్లైమేట్‌ రిస్క్‌ ఇండెక్స్‌లో రానున్న 20 ఏళ్ళలో తీవ్ర స్థాయి నుంచి అతితీవ్ర స్థాయి వాతావరణ మార్పుల కారణంగా మౌలిక సదుపాయాలు శిథిలమయ్యే దేశాల జాబితా తొలి 10 ర్యాంకింగ్‌ల్లో భారత్‌ ఉంది. ఇది భారత భూశాస్త్రాలకు సరికొత్త సమస్యగా మారింది. రాబోయే దశాబ్దంలో అత్యధిక జనాభా కలిగిన భారత్‌లోని నేలలు పొడిగా, వేడిగా మారతాయని ఈ అంచనా పేర్కొంది. ఈ శతాబ్దం చివరి నాటికి భారత్‌లో సగటు ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల సెల్సియస్‌ పెరుగుతాయి. హిందూ మహాసముద్రంలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా రుతుపవన కాలాల్లో మార్పొచ్చింది. హిమానీ నదాలు కరుగుతున్నాయి. సముద్రమట్టం దాదాపు ఓ అడుగు పెరిగింది. సమస్యాత్మక ప్రజావిధానం కూడా భారత్‌లో వాతావరణం దుర్బలత్వానికి దారితీస్తోంది. విలువైన నీటి వనరుల వినియోగం కూడా మౌలిక సదుపాయాలకు తీవ్ర హాని కలిగిస్తోంది.

రానున్న రెండు దశాబ్దాల్లో వాతావరణ మార్పులు దేశంలో విధ్వంసకర పరిస్థితులకు కారణమౌతాయని ఈ నివేదిక పేర్కొంది. అలాగే కోట్లాదిమందికి స్థానభ్రంశం కల్పిస్తాయి. పొడి వాతావరణం, నీటి కొరత, ఉపాధి అవకాశాల్ని నిర్వీర్యం చేస్తాయి. శీతోష్ణస్థితి ప్రేరిత సామూహిక స్థానభ్రంశం జనసాంద్రత అధికంగా ఉండే తీరప్రాంతాల్లో మరింత ఎక్కువగా కనిపిస్తుందని ఈ పరిశోధన తేల్చింది. ఇప్పటికే విధ్వంసక తుపానుల కారణంగా భూమి కోతకు గురౌతోంది. నీటిలో లవణాల శాతం పెరుగుతోంది. ప్రపంచబ్యాంక్‌ అధ్యయనం మేరకు 2050 నాటికి దేశంలో నాలుగింట ఒకవంతు మంది వలసదార్లయ్యే ప్రమాదముంది. ఈ ప్రభావాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. తీరప్రాంతాల్లో నేల గుల్లబారింది. వరుస ప్రకృతి వైపరీత్యాల ప్రభావం ప్రకృతి వనరులైన భూమి, నీరు, గాలిపై స్పష్టంగా కనిపిస్తోంది. ఏళ్ళ వయస్సున్న మహావృక్షాలు వాటంతటవే కూలిపోతున్నాయి. మైదాన ప్రాంతాల్లోని రైలుపట్టాలు తరచూ ఇసుక కోతకు గురౌతున్నాయి. ఇవి ప్రమాదాలకు దారితీస్తున్నాయి.

2022 జనవరి – సెప్టెంబర్‌ మధ్య 9 నెలల కాలంలో దేశంలో ప్రతిరోజు ఎక్కడోచోట ఒక తీవ్ర వాతావరణ సంఘటన జరిగింది. ఇవి లక్షలాది కుటుంబాల జీవనాధారాన్ని ధ్వంసం చేసింది. అప్పట్నుంచి మానవాళిపై ప్రకృతి ప్రతీకారానికి పాల్పడుతోందన్న సం దేహాలు పెరిగాయి. పర్యావరణ జీవన విధ్వంసాల కారణంగా కార్బన ఉద్గారాల విడుదల అనూహ్యంగా పెరిగింది. మానవళి రానున్న రెండు దశాబ్దాల్లో మనుగడ సంక్షోభాన్ని ఎదుర్కోనుంది. క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలపైపడే ఈ ప్రమాదం పరోక్షంగా ప్రజల ఉపాధి అవకాశాల్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇది ఆకలికి దారితీస్తుంది. పేదరికాన్ని పెంచుతుంది. ఈ ప్రమాద నివారణకు ఇప్పట్నుంచి తగిన ముందస్తు చర్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీవ్ర వాతావరణ పీడిత దేశాలకు సాయం చేసేందుకు ఆర్థికంగా ఉన్నత దేశాలు కొంత నిధిని సమీకరించాలన్న ప్రయత్నం కూడా సఫలం కాలేదు. పారిశ్రామికంగా అగ్రస్థానాల్లో ఉన్న దేశాల్నుంచి వెలువడుతున్న కర్బన ఉద్గారాలే మొత్తం భూమండలం వేడికి, వాతావరణ సమశీతోష్ణ పరిస్థితుల్లో అసమతుల్యత ఏర్పడేందుకు దారితీస్తోంది. ఈ ఫలితాన్ని భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక వంటి దేశాలు అధికంగా భరించాల్సిన పరిస్థితేర్పడుతున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement