Tuesday, November 26, 2024

కరోనా నుంచి కోలుకున్నారా..? డీ- డైమర్ టెస్టు చేయించుకోండి!

కరోనా కొత్త వేరియంట్‌ వల్లగానీ, ఇతర కారణాల వల్లగానీ రెండో దశలో ఎక్కువ మంది యువత బాధితులవుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో 25- 30 ఏళ్ల యువకులు ఎక్కువగా చనిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. అప్పటివరకు బాగా ఉన్నవారు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలుతున్నారు. కొందరు కరోనా తగ్గి.. ఇంటికి వెళ్లి మందులు వాడుతూ కూడా గుండెపోటుతో మరణిస్తున్నారు. కొందరు రోగుల రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం (థ్రాంబోసిస్‌) వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయని కరోనా తొలి దశలోనే వైద్యులు గుర్తించారు. 

కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారిలో చాలా మంది ఆయాసం, కండరాల నొప్పి లాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కోవిడ్ తగ్గిన తర్వాత బాధితుల్లో ఇతరత్రా అనారోగ్య సమస్యలు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొందరిలో రక్తం గడ్డ కట్టడాన్ని డాక్టర్లు గుర్తించారు. దీంతో బెంగళూరు డాక్టర్లు కోవిడ్ నుంచి కోలుకున్న వారికి నిర్ణీత సమయం ప్రకారం ‘డి-డైమర్’ (D-dimer) అనే టెస్ట్ చేస్తున్నారు. దీని వల్ల పేషెంట్ పూర్తిగా ప్రమాదం నుంచి బయటపడ్డాడా లేదా అనేది నిర్ధారించుకోవచ్చు.

కోవిడ్ కేవలం ఊపిరితిత్తుల మీదే కాదు గుండె, ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రక్తం గడ్డకట్టినట్లు గుర్తిస్తే.. ఈ సమస్యను తగ్గించడానికి రక్తాన్ని పలుచన చేసే ఔషధాలను ఇస్తున్నారు. పేషెంట్‌కు ఎంత మోతాదులో బ్లడ్ థిన్నర్ అవసరమో తెలుసుకోవడం కోసం డి-డైమర్ టెస్టు ఉపకరిస్తోంది. ‘డి-డైమర్’ పరీక్షతో రక్తం గడ్డ కట్టే తత్వం ఎంత ఉందనేది తేలుతుంది. ఫలితం 500 లోపు ఉంటే నార్మల్‌గా, 500 అంతకంటే ఎక్కువ ఉంటే, కొవిడ్‌ ప్రభావం మొదలైందని గ్రహించి అందుకు తగిన చికిత్సను వైద్యులు ఎంచుకుంటారు. ఫలితం 10 వేలు దాటితే ఊపిరితిత్తుల్లో చిన్న చిన్న రక్తపు గడ్డలు ఏర్పడ్డాయని అర్థం చేసుకోవాలి. వీళ్లకు రక్తాన్ని పలుచన చేసే ఇంజెక్షన్లతో చికిత్స అవసరం అవుతుంది.

కరోనా నుంచి కోలుకున్న తర్వాత చాలా మంది అకస్మాత్తుగా మరణించారు. కొవిడ్ ను జయించిన ప్రతి ఒక్కరు ‘డి-డైమర్’ టెస్టు చేయించుకోవాలి. వైరస్ మన శరీరంపై ఏ ప్రభావం చూపిందనే విషయం దీని వల్ల తెలుస్తుంది. ఒకవేళ దుష్ప్రభావాలు కనిపిస్తే డ్రగ్స్, ఇంజెక్షన్లు ద్వారా నయం చేయవచ్చు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నామని బాధితులు భావించవచ్చు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నం. శరీరంలో రక్తం గడ్డ కట్టిందనే విషయాన్ని వారు గుర్తించలేరు. అందువల్ల అకస్మాత్తుగా చనిపోతారు. పరీక్ష చేయించుకుని డీ-డైమర్ స్థాయి అధికంగా ఉందని తెలిస్తే వారి రక్తం పలుచన చేయడానికి హెపరిన్ తో చికిత్స అందిస్తారు.

‘డి-డైమర్’ కూడా రక్త పరీక్ష లాంటిదే. మన శరీరంలోని రక్త కణాల గురించి తెలుస్తుంది. ఒకవేళ ఊపిరితిత్తులు, గుండె, మెదడులో ఎక్కడైనా రక్తం గడ్డకడితే ‘డి-డైమర్’ సంకేతమిస్తుంది. రిపోర్టు ఆధారంగా వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభిస్తారు. కొవిడ్ బాధితుల్లో రక్తం గడ్డకట్టి ఊపిరితిత్తులను చేరుకుంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడుతుంది. వెంటనే అప్రమత్తమై ఈ పరీక్ష చేయించుకోవాలి. కరోనా చికిత్స సమయంలో ఆక్సిజన్ స్థాయి తగ్గితే డీ- డైమర్ అధికంగా ఉందని సంకేతం. రక్తంలో అసాధారణంగా క్లాట్స్ ఉన్నా ‘డి-డైమర్’ టెస్టు ద్వారా తెలుసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉన్నవారి రక్తంలో ‘డి-డైమర్’ స్థాయిని గుర్తించలేం. కోవిడ్ పేషెంట్లతోపాటు శ్వాస సంబంధ సమస్యలను ఎదుర్కొంటున్న వారిలో అసాధారణ బ్లడ్ క్లాటింగ్‌ సమస్య పెరుగుతున్నట్లు డాక్టర్లు తెలిపారు.

- Advertisement -

ఇదీ చదవండి: వ్యాక్సిన్ కొరత: కొవిషీల్డ్ రెండో డోసు 16 వారాల తర్వాతే..!

Advertisement

తాజా వార్తలు

Advertisement