Saturday, November 23, 2024

పిలిప్పీన్స్‌లో భారీ తుపాను.. ఎయిర్‌లైన్స్ ర‌ద్దు.. హైల‌ర్ట్ ప్ర‌క‌టించిన అధికారులు..

ఫిలిప్పీన్‌ వైపు రాయ్ టైఫూన్‌ తుపాన్‌ దూసుకొస్తోంది. ఇది ఈ ఏడాది దేశంలో 50వ తుపాను కావ‌డం గ‌మ‌నార్హం. అంతేకాకుండా అత్యంత శక్తివంతమైన తుపానుగా వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు ఇప్పటికే వేలాదిమంది ప్రజలను ఆ దేశ ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. చాలా మంది భయంతో ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా ఫిలిప్పీన్స్‌కు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేశారు. అన్ని పోర్టులు తాత్కాలికంగా మూసివేశారు.ఫిలిప్పీన్స్‌ వైపు వ‌స్తున్న‌ రాయ్ టైఫూన్‌ తుపానును అమెరికా నేవీ జాయింట్‌ టైఫూన్‌ వార్నింగ్‌ సెంటర్‌ ‘సూపర్‌ టైఫూన్‌’గా అభివర్ణించింది. దేశంలో ఈ యేడాది సంభవించిన తుఫానుల్లో ఇది అత్యంత శక్తివంతమైన తుఫానుగా మారబోతోందని పేర్కొంది.

గంటకు 190 కిలోమీట‌ర్ల వేగంతో..
వాతావరణ శాఖ అంచ‌నాల మేరకు.. ఫిలిప్పీన్స్‌ దేశానికి మధ్య, దక్షిణ భాగాల వైపు సూపర్‌ టైఫూన్‌ వేగంగా కదులుతోంది. రానున్న రోజుల్లో ఈదురు గాలులతోపాటు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. కాగా, ఫిలిప్పీన్స్‌లో రాయ్ హరికేన్‌ తుపాను గంటకు 190 కి.మీ వేగంతో కదులుతోంది. విపత్తు నిర్వహణ బృందం అన్ని నౌకలను ఓడరేవులో ఉంచాలని కోరింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ సముద్రం వైపు ఎవ్వరూ వెళ్లవద్దని హెచ్చరించింది.

హై అలర్ట్‌…
అధికారులు తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.. ఫిలిప్పీన్‌లోని అన్ని ప్రాంతాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. ముఖ్యంగా 8 ప్రాంతాల్లో అత్యవసర సన్నాహాలు చేశారు. టైఫూన్‌ కారణంగా పసిఫిక్‌ మహాసముద్రం సమీప ప్రాంతాల్లోని సుమారు 98 వేల‌ మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే 8 ప్రభావిత ప్రాంతాల్లో 30 మిలియన్ల మంది నివసిస్తున్నారు. ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలు విసాయా – మిండనావో ఐలాండ్ల మధ్య ఉన్నాయి. కాగా, తుఫాను సమయంలో, ఆ తర్వాత కూడా దేశవ్యాప్తంగా భారీ వర్షం, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో వరద ముప్పు పొంచి ఉన్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఫిలిప్పీన్స్‌కు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేశారు. అన్ని పోర్టులు తాత్కాలికంగా మూసివేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement