– – ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
సైక్లోన్ మోచా మాదిరిగానే, సైక్లోన్ బిపార్జోయ్ కూడా భారతదేశంపై పెద్దగా ప్రభావం చూపకుండా పరారవుతుందని అంతా భావిస్తున్నారు. అయితే.. తుపాను వల్ల దేశంలోని పశ్చిమ తీరం వెంబడి వాతావరణంలో తీవ్ర అవాంతరాలు, వర్షపాతం ఉంటుందని భావిస్తున్నారు. కాగా ఇవ్వాల (బుధవారం, జూన్ 7) సాయంత్రం నుండి బిపార్జోయ్ తుపాను గురించి తెలిసిన కొన్ని వివరాలు ఏంటంటే…
ల్యాండ్ ఫాల్..
జూన్ 7 ఉదయం నాటికి అల్పపీడనం కరాచీకి దక్షిణంగా 1,370 కి.మీ దూరంలో ఉందని వాతావరణ కార్యాలయం తెలిపింది. బిపార్జోయ్ తుపాను పాకిస్తాన్‌లో తీరం దాటే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇది ముంబయి రుతుపవనాల రాకను ప్రభావితం చేస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
తుఫాను ఇవ్వాల ఆరు గంటల్లో దాదాపు 2 kmph వేగంతో ఉత్తరం వైపు కదిలి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందినట్టు వాతావరణ శాఖ చెబుతోంది. గోవాకు పశ్చిమ-నైరుతి దిశలో 890 కి.మీ, ముంబైకి నైరుతి దిశలో 1,000 కి.మీ, పోర్‌బందర్‌కు నైరుతి-నైరుతి దిశలో 1,070 కి.మీ.. కరాచీకి దక్షిణంగా 1,370 కి.మీ దూరంలో బిపార్జోయ్ ఉందని భారత వాతావరణ శాఖ అప్డేట్ ఇచ్చింది..
ఇది దాదాపు ఉత్తరం వైపుకు మళ్లి, తీవ్ర తుపానుగా మారుతుందని, ఆ తర్వాత మూడు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని IMD తెలిపింది. అయితే, భారతదేశం, ఒమన్, ఇరాన్, పాకిస్తాన్‌తో సహా అరేబియా సముద్రం వెంబడి ఉన్న దేశాలపై పెద్దగా ప్రభావాన్ని అంచనా వేయలేదు. ఇక.. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దనే హెచ్చరికలున్నాయి.
భారతదేశంపై ప్రభావం..
దేశంలో నైరుతి రుతుపవనాల పురోగతిని తుపాను ప్రభావితం చేసే అవకాశం ఉందని IMD తెలిపింది. అరేబియా సముద్రంలో ఏర్పడుతున్న తుపాను, అల్పపీడనం ప్రభావంతో దక్షిణ ద్వీపకల్పంలో వర్షాలు కురుస్తాయని సీనియర్ ఐఎండీ శాస్త్రవేత్త తెలిపారు. మేఘ ద్రవ్యరాశి ఈ వ్యవస్థ చుట్టూ కేంద్రీకృతమై ఉందని, తగినంత తేమ కేరళ తీరానికి చేరుకోవడం లేదని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.