Tuesday, November 26, 2024

న్యూడ్​ వీడియోల పేరుతో సైబర్​ మోసం.. చర్లపల్లి జైలు ఉన్నతాధికారికే టోకరా!

సైబర్ నేరగాళ్ల బారినపడి చర్లపల్లి జైలు ఉన్నతాధికారి ఒకరు దాదాపు లక్ష రూపాయల దాకా సమర్పించుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న ఒక అధికారికి ఈ మధ్య ఫోన్​ చేసిన కొందరు యువతులు ఆయనతో చాటింగ్ చేశారు. ఆ తర్వాత న్యూడ్​ వీడియో కాల్‌లో మాట్లాడారు. ఆయనతోనూ అలాగే మాట్లాడించారు. దాన్ని రికార్డు చేసిన నేరగాళ్లు ఆ తర్వాత వారి అసలు రూపం బయటపెట్టారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు దిగారు. వారి బెదిరింపులను ఆయన పట్టించుకోలేదు.

ఆ తర్వాత కొన్ని రోజులకు సీబీఐ అధికారి అజయ్ కుమార్ పాండే పేరుతో జైలు అధికారికి ఫోన్ చేసి.. మీ అసభ్య వీడియోపై యూట్యూబ్ నుంచి ఫిర్యాదు అందిందని, తనకు డబ్బులు చెల్లిస్తే మేనేజ్ చేసుకుంటానని నమ్మించాడు. అంతేకాకుండా సీబీఐ పేరుతో నకిలీ లేఖ కూడా పంపాడు. రాహుల్ శర్మ అనే వ్యక్తి నెంబరు ఇచ్చి జైలు అధికారికి ఫోన్ చేసి సెటిల్ చేసుకోవాలని సూచించాడు. ఆయన ఇచ్చిన నెంబరుకు జైలు అధికారి ఫోన్ చేశారు.

అయితే.. యూట్యూబ్ నుంచి న్యూడ్​ వీడియోలు తొలగించేందుకు రెండు విడతలుగా రూ. 97,500 ఇచ్చారు జైలు అధికారి. ఆ తర్వాత కూడా మరోమారు ఫోన్ చేసి మరో రెండు వీడియోలు ఉన్నాయని, వాటిని వైరల్ చేయకుండా ఉండాలంటే రూ.85 వేలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీంతో అయోమయంలో పడిన అధికారిని గమనించిన తోటి ఉద్యోగి విషయం ఆరా తీశారు. అది విని ఇది సైబర్ మోసం తప్ప మరోటి కాదని ఆయనకు చెప్పారు. దీంతో ఆయన కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement