Friday, November 22, 2024

Cyber Crime – ఒకే ఒక్క కాల్‌.. ₹12 కోట్లు గాయబ్

సైబర్ క్రిమినల్స్ కొత్త పోకడలు​​
బెంగ‌ళూరులో మోస‌పోయిన వృద్ధురాలు
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
సంపన్నవర్గాలపై పేట్రేగిపోతున్న నేర‌గాళ్లు
అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న పోలీసులు
అయినా ప‌ట్టించుకోని ప్ర‌జ‌లు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్: ప్ర‌భుత్వ, పోలీసులు ఎన్నో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టినా సైబ‌ర్ నేరాల‌కు అడ్డు లేక‌పోతోంది. రోజు రోజుకూ సైబ‌ర్ నేర‌గాళ్లు త‌మ పంజా విసురుతునే ఉన్నారు. పోలీసులు చేప‌ట్టిన అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు, ప్ర‌చారాలు కూడా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. దీనివ‌ల్ల రోజురోజుకు సైబ‌ర్ నేరాలు పెరిగిపోతున్నాయి. బెంగ‌ళూరుకు చెందిన 77 ఏళ్ల వృద్ధురాలిని కొత్త పంథాలో సైబ‌ర్ నేరగాళ్లు బెదిరించి 12 కోట్ల రూపాయలు కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

- Advertisement -

ఆ మహిళా ఎలా మోసాయారంటే..

బెంగళూరుకు చెందిన సంపన్న కుటుంబానికి చెందిన లక్ష్మీ శివకుమార్‌ అనే 77 ఏళ్ల మహిళకు టెలికాం శాఖ అధికారుల పేరుతో ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. మీ పేరుతో ఉన్న సిమ్‌ కార్డ్‌ను ఉపయోగించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఫోన్‌లో వివరించారు. దీంతో ఆమె భయపడిపోయింది. ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు కంప్లైంట్‌ అందినట్లు ఫోన్‌లో సైబర్‌ నేరస్థులు చెప్పుకొచ్చారు. మీ సిమ్‌ కార్డును ఉపయోగించే మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు తెలిపారు. వెంటనే బ్యాంక్​ ఖాతాలు, ఇన్​వెస్ట్​మెంట్​ వివరాలను ఇవ్వాలని లేదంటే అరెస్ట్‌ చేస్తామని హెచ్చరించారు.

నకిలీ ఎఫ్​ఐఆర్​ కాపీలు..

అంతటితో ఆగకుండా నకిలీ ఎఫ్‌ఐఆర్‌ డాక్యుమెంట్‌తో పాటు సుప్రీం కోర్టు జారీ చేసినట్లు ఉన్న నకిలీ అరెస్ట్ వారెంట్‌ను కూడా ఆ మహిళా స్మార్ట్​ఫోన్​కు పంపించారు. దీంతో ఆమె ఇదంతా నిజమే అనుకుంది. అరెస్ట్ చేయకుండా ఉండాలంటే వెంటనే డబ్బులు చెల్లించాలని చెప్పడంతో మరింతగా భయపడిపోయిన ఆమె వెనకా ముందు ఆలోచించకుండా ఏకంగా రూ. 12 కోట్లు చెల్లించేసింది. ఆ తర్వాత వెంటే వారికి వృద్దురాలికి కనెక్షన్ కట్‌ అయిపోయింది. తిరిగి మాట్లాడేందుకు కాల్ చేసినా ఫలితం దక్కలేదు. చివిరికి, తాను మోసపోయినట్టు తెలుసుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అప్ర‌మ‌త్తంగా ఉండాలి..

సైబర్‌ నేరస్తులు పొంచి ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. మీరు ఏ తప్పు చేయని నేపథ్యంలో ఎవరికీ భయపడాల్సి అవసరం లేదని గుర్తు పెట్టుకోండి. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వివరాలను ఇతరులకు చెప్ప కూడ‌దు. ఎవరైనా ఇలాంటి కాల్స్ చేస్తే వెంటనే పోలీసులను సంప్రదించడం ఉత్తమమని సూచిస్తున్నారు.

సైబ‌ర్ నేరగాళ్ల నుంచి త‌ప్పించుకునేదిలా…

సైబ‌ర్ నేర‌గాళ్ల నుంచి త‌ప్పించుకోవాలంటే పోలీసులు నిర్వ‌హించే అవ‌గాహ‌న స‌ద‌స్సుల‌కు, ప్ర‌చారాల‌కు స్పందించాలి. పోలీసులు, బ్యాంక్ అధికారులు, ఇత‌ర అధికారుల పేరుతో ఎవ‌రైనా ఫోన్ చేసి ఆర్థిక వివ‌రాలు చ‌ర్చిస్తే… ఒక్క‌సారి రీ చెక్ చేసుకోవాలి. అవ‌స‌ర‌మైతే కుటుంబ‌స‌భ్యుల దృష్టికి గానీ, పోలీసుల దృష్టికి గానీ తీసుకు వెళ్లాలి. లేకుంటే పోలీసు స్టేష‌న్ పేరు గానీ, బ్యాంకు గానీ చెబితే అక్క‌డికి వ‌చ్చి క‌లుస్తాన‌ని స‌మాధానం చెప్పి ఫోన్ క‌ట్ చేయాలి. ఇలా చేస్తే సైబ‌ర్ నేరాల నుంచి త‌ప్పించుకునే అవ‌కాశం ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement