తెలంగాణలో భారీ ఎత్తున ఐపీఎస్ అధికారులను బదిలీలు చేస్తూ నిన్న రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా 30 ఐపీఎస్ లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. అందులో భాగంగా హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా సీవీ ఆనంద్ ను నియమించింది. ఇప్పటి వరకు హైదరాబాద్ సీపీగా ఉన్న అంజనీ కుమార్ ను ఏసీబీ డీజీ గా బదిలీ చేసింది.
2018 ఏప్రిల్‌లో కేంద్ర సర్వీసులకు వెళ్లిన సీవీ ఆనంద్.. మూడున్నర నెలల కిందట తిరిగి తెలంగాణ కేడర్‌కు బదిలీపై వచ్చారు. ఈ క్రమంలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. కాగా, గతంలో సీవీ ఆనంద్ హైదరాబాద్ ట్రాఫిక్ విభానికి చీఫ్ గా పని చేసిన చేశారు. ఆగస్టు 2016లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనంద్‌ను పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా నియమించారు. 2018లో కేంద్ర డిప్యూటేషన్‌పై వెళ్లే వరకు ఈ పదవిలో కొనసాగారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో అవకతవకలను అరికట్టడంలో ఆనంద్ కీలక పాత్ర పోషించారు. స్టాక్‌లను తరలించే ట్రక్కులకు GPS ట్రాకింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టడం ద్వారా PDS స్టాక్‌లను బ్లాక్ మార్కెట్‌కు మళ్లించకుండా చర్యలు తీసుకున్నారు. ఆనంద్ ఎక్సైజ్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. అంతేకాదు 2016 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కూడా పనిచేశారు.
నల్గొండ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న రంగనాథ్‌ను హైదరాబాద్ ట్రాఫిక్ సంయుక్త సీపీగా బదిలీ అయ్యారు. మెదక్ ఎస్పీగా ఉన్న చందనా దీప్తిని హైదరాబాద్ నార్త్ జోన్ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుదీర్ఘకాలంగా రాచకొండ కమిషనర్‌గా ఉన్న మహేశ్ భగవత్‌కు స్థానచలనం కలగలేదు. నారాయణపేట ఎస్పీ చేతనకు పోస్టింగు ఇవ్వలేదు. సిద్దిపేట, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లు, 11 జిల్లాల ఎస్పీలను బదిలీ చేశారు. ఒకటి రెండు రోజుల్లో మరిన్ని బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ స్థాయిలో బదిలీలు చేపట్టడం గత మూడేళ్లలో ఇదే తొలిసారి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..