Tuesday, November 26, 2024

క‌స్ట‌డీ హిట్టా.. ఫ‌ట్టా

త‌మిళ ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు తెర‌కెక్కించిన తెలుగు చిత్రం క‌స్ట‌డీ. ఈ చిత్రంలో హీరోగా నాగ‌చైత‌న్య న‌టించాడు.మ‌రి ఈ చిత్రం చైతూకి హిట్ట్ ని అందించిందా లేదా ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం..

కథఏంటంటే. శివ (నాగచైతన్య) 90వ దశకంలో గోదావరి ప్రాంతంలోని సకినేనిపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్. తాను ప్రేమించిన రేవతి (కృతి శెట్టి)ని బలవంతంగా మరో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తుండటంతో తనను ఎలా సొంతం చేసుకోవాలో తెలియక అయోమయంలో ఉన్న అతడికి రాజు (అరవింద్ స్వామి) అనే పెద్ద రౌడీ కారణంగా మరో తలనొప్పి మొదలవుతుంది. సీఎం స్థాయిలో రాజును టార్గెట్ చేయడంతో అతణ్ని కాపాడి.. బెంగళూరులోని సీబీఐ కోర్టులో హాజరు పరచాల్సిన బాధ్యత శివ మీద పడుతుంది. మరి శివ ఆ బాధ్యతను ఎలా నెరవేర్చాడు.. ఈ క్రమంలో రేవతి సమస్యను ఎలా పరిష్కరించి ఆమెను తన సొంతం చేసుకున్నాడు అన్నది మిగతా కథ.

విశ్లేషణ.. తమిళంలో వెంకట్ ప్రభు అంటే ఒక బ్రాండ్. తెలుగులోకి కూడా అనువాదమైన ‘సరోజ’.. ‘గ్యాంబ్లర్’.. లాంటి సినిమాలు చూస్తే ఆయన మార్కు స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కువ థ్రిల్లర్ కథాంశాలను ఎంచుకుని.. ఓవైపు ఉత్కంఠ రేపుతూనే.. ఇంకోవైపు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం వెంకట్ ప్రభు శైలి. దర్శకుడిగా పరిచయం అయి దశాబ్దంన్నర దాటినా.. ఇంకా తనలో చేవ తగ్గలేదని ఈ మధ్యే ‘మానాడు’ సినిమాతో రుజువు చేశాడు వెంకట్. అది ఒక విదేశీ చిత్రం స్ఫూర్తితో తెరకెక్కినప్పటికీ.. ఇక్కడి నేటివిటీతో అతను ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తూ వినోదాన్ని పంచిన విధానం హైలైట్. ఇలాంటి ట్రాక్ రికార్డున్న దర్శకుడు.. మన నాగచైతన్యతో ఒక థ్రిల్లర్ సినిమా తీశాడంటే అది ఆషామాషీగా ఉండదనే అనుకుంటాం. కానీ ఇన్నేళ్ల కెరీర్లో ఫ్లాప్ సినిమాల్లో కూడా తన మార్కు అంటూ చూపించిన వెంకట్ ప్రభు.. ‘కస్టడీ’లో మాత్రం గాడి తప్పేశాడు. ‘నాయట్టు’ లాంటి కల్ట్ మూవీ స్ఫూర్తితో ‘కస్టడీ’ కథ రాసుకున్నట్లు చెప్పిన వెంకట్.. అందులోని బిగిని.. ఇంటెన్సిటీని ఇందులో ఎంతమాత్రం చూపించలేకపోయాడు. మూడు రోజుల వ్యవధిలో జరిగే కథ.. ఒక క్రిమినల్ ను కాపాడే కానిస్టేబుల్.. ‘కస్టడీ’ గురించి ఈ మాటలు విని.. రియలిస్టిగ్గా సాగే ఇంటెన్స్ థ్రిల్లర్ సినిమాను ఆశిస్తాం కానీ.. ఇదొక సగటు కమర్షియల్ సినిమాలా సాగడం అతి పెద్ద నిరాశ.’కస్టడీ’లో ఆశ్చర్యపరిచే విషయం.. చిన్న చిన్న పాత్రలకు కూడా పేరున్న ఆర్టిస్టులను తీసుకోవడం. అరవింద్ స్వామి.. శరత్ కుమార్.. సంపత్.. ప్రియమణి.. జీవా.. ఆనంది.. రాంకీ.. జయసుధ.. జయప్రకాష్.. ఇలా చాలామంది పెద్ద ఆర్టిస్టులను సినిమాలో చూస్తాం. కానీ ఇంతమందిలో ఒక్కరంటే ఒక్కరికి కూడా చెప్పుకోదగ్గ పాత్ర లేకపోవడం మైనస్. కనీసం హీరో పాత్రనైనా వెంకట్ ప్రభు ఆసక్తికరంగా తీర్చిదిద్దాడా అంటే అదీ లేదు. వెంకట్ ప్రభు సినిమాలో హీరో కానిస్టేబుల్ అంటే.. అది రియలిస్టిగ్గా సాగుతూ.. హీరో పాత్ర కథలో ఇమిడిపోయి ఉంటుందని.. సగటు కమర్షియల్ సినిమాల్లో మాదిరి లేని పోని ఎలివేషన్లు ఉండవని.. కథ ముందుకు సాగేకొద్దీ దాంతో ట్రావెల్ చేస్తామని అనుకుంటాం. కానీ ఈ పాత్ర ఆరంభంలో అలాంటి ఆశలే రేకెత్తించినా.. ముందుకు సాగేకొద్దీ రొటీన్ హీరో క్యారెక్టర్లాగే మారిపోతుంది. ఎప్పుడూ చూసే ఫైట్లు.. ఎలివేషన్లు తప్ప పాత్రలో ఏ ప్రత్యేకతా కనిపించదు.

- Advertisement -

నటీనటుల న‌ట‌న‌.. నాగచైతన్య నిబద్ధత కలిసి కానిస్టేబుల్ పాత్రను పండించడానికి బాగానే కష్టపడ్డాడు. పాత్రకు అవసరమైన ఇంటెన్సిటీ చూపించాడు. తన అన్నయ్య ప్రాణాలు పోయే సన్నివేశంలో అతడి నటన ఆకట్టుకుంటుంది. కొన్ని సన్నివేశాల్లో మాత్రం చైతూ నిస్సహాయంగా కనిపించాడు. కృతి శెట్టికి పెర్ఫామెన్స్ స్కోప్ ఉన్న పాత్రే దక్కింది. ‘వారియర్’.. ‘బంగార్రాజు’ లాంటి సినిమాలతో పోలిస్తే తన పాత్ర.. నటన ఇందులో మెరుగే. అరవింద్ స్వామి చేసిన రాజు పాత్ర.. ఆయన స్థాయికి తగ్గది కాదు. ఆరంభంలో ఆ క్యారెక్టర్ని ఏదో ఊహించుకుంటాం కానీ.. చివరికి అది రొటీన్ గా ముగుస్తుంది. శరత్ కుమార్ పాత్రలో కూడా బిల్డప్ ఎక్కువ.. విషయం తక్కువ. రాంకీ చేసిన అతిథి పాత్ర.. దానికి ఇచ్చిన ట్విస్ట్ వెటకారంగా అనిపిస్తుంది. ముఖ్యమంత్రి పాత్రలో ప్రియమణి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. కానీ తన పాత్రలో బలం లేదు. వెన్నెల కిషోర్ కాస్త నవ్వించాడు. సంపత్.. జయప్రకాష్.. గోపరాజు రమణ.. వీళ్లంతా తమ పరిధిలో బాగానే నటించారు.

టెక్నిక‌ల్స్..ఇళయరాజా-యువన్ శంకర్ రాజాల అరుదైన కలయిక చూసి సంగీత పరంగా ఎంతో ఊహించుకుంటాం కానీ.. పాటలు భరించలేని స్థాయిలో ఉన్నాయి. ఒక్క పాట కూడా మినిమం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయింది. నేపథ్య సంగీతం పర్వాలేదు. కదీర్ ఛాయాగ్రహణం ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ ఆశించినంత గొప్పగా లేవు. కొన్ని సన్నివేశాల్లో భారీతనం ఉన్నా.. ఓవరాల్ గా సినిమాలో అంత క్వాలిటీ కనిపించలేదు. అబ్బూరి రవి మాటలు సోసోగా అనిపిస్తాయి. సినిమాకు సంబంధించి లోపమంతా వెంకట్ ప్రభు స్క్రిప్టులోనే ఉంది. కథ లైన్ బాగున్నా.. అది పూర్తి స్క్రిప్టుగా మారే క్రమంలో బిగి.. ఉత్కంఠ లోపించాయి. సినిమా మొత్తంలో చూసుకుంటే ఎగ్జైటింగ్ గా అనిపించే ఎపిసోడ్ ఏదీ లేదు. టేకింగ్ లోనూ వెంకట్ ప్రభు తన మార్కును చూపించలేకపోయాడు.మొత్తానికి క‌స్ట‌డీ ప్రేక్ష‌కుల‌ని ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement