వాళ్లిద్దరు సొంత అక్కాచెల్లెళ్లు.. ఇద్దరికీ ఒకే ముహూర్తానికి ఒకే మండపంలో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. అందరూ అనుకున్నట్టుగానే సంబంధాలు మ్చాచ్ అయ్యాయి. మంచి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. పెళ్లికి అంతా రెడీ అయ్యారు. ఒక తాళిబొట్టు కట్టాల్సిన టైమ్‌లో కరెంట్ పోవడంతో అనుకున్న ముహుర్తానికే పెళ్లి చేయాలని డిసైడైన పెద్దలు.. మసక వెలుతురులోనే ఆ తంతు కాస్త ముగించారు. అప్పగింతల తర్వాత అత్తారింటికి వెళ్లిన ఆ పెళ్లికూతుళ్లను చూసి పెళ్లి కొడుకులు షాకయ్యారు. పెళ్లికూతుళ్లు మారిపోయారని తెలిసి పంచాయితీ పెట్టారు.
సినిమా తరహాలో జరిగిన ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. ఉజ్జయిన్‌కు చెందిన రమేశ్ లాల్కు నికిత, కరిష్మా అనే ఇద్దరు కూతుళ్లున్నారు. వారిద్దరికీ ఒకేసారి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లుగానే కూతుళ్లకు వేర్వేరు కుటుంబాలకు చెందిన దంగ్వారా భోలా, గణేశ్ అనే యువకులతో సంబంధం కుదుర్చుకున్నాడు. పెళ్లి కూతుళ్లుగా ముస్తాబైన అక్కాచెల్లెళ్లు ముఖాన్ని తెరతో కప్పుకుని మండపంలోకి వచ్చారు. పెళ్లి తంతు ప్రారంభమైంది. ఇంతలో కరెంటు పోవడంతో పెళ్లికొడుకులు తారుమారయ్యారు. అక్కను చేసుకోవాల్సిన వరడు చెల్లిని, చెల్లెల్ని చేసుకోవాల్సిన పెళ్లికొడుకు అక్క మెడలో మూడు ముళ్లు వేశారు.
పెళ్లి ముగిసి అప్పగింతల తర్వాత వధువులిద్దరూ అత్తారింటికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత అసలు విషయం బయటపడింది. పెళ్లి కూతుళ్లు మారిపోయారని తెలుసుకున్న వరుడు తరఫు వారు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. పెద్ద మనుషులను పిలిచి పంచాయితీ పెట్టారు. చివరకు మూడు కుటుంబాలు ఒక అంగీకారానికి వచ్చి ముందుగా అనుకున్న ప్రకారం మళ్లీ పెళ్లి జరిపించారు.