Tuesday, November 19, 2024

ఏపీలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు

ఏపీలో కరోనా ప్రభావంతో విధించిన కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కర్ఫ్యూ విధించి 10 రోజులే అయిందని సీఎం జగన్ తెలిపారు. ఫలితాలు రావాలంటే కనీసం నాలుగు వారాలు కర్ఫ్యూ ఉండాలని అభిప్రాయపడ్డారు. కేసులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగిస్తున్నట్లు సీఎం చెప్పారు. రూరల్‌ ప్రాంతంలో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయాల వ్యవస్థను సమర్థవంతంగా  వినియోగించుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.

కాగా, కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు అవుతోంది. దాదాపు 18 గంటల పాటు కర్ఫ్యూ అమలవుతున్న కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ప్రతి రోజు 20 వేల పై చిలుకు కేసులు నమోదు అవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. వేల సంఖ్యలో కేసులు, వందల్లో మరణాలు సంభవిస్తున్నాయి. రోజు రోజుకూ కేసుల సంఖ్య బీభత్సంగా పెరుగుతూనే ఉంది. నిన్న 94,550 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఏకంగా 24,171 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 14,35,491కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 101 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 9,372కి పెరిగింది. అనంతపురం జిల్లాలో 14 మంది, విశాఖపట్నంలో 11, చిత్తూరులో 10, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణ, విజయనగరం జిల్లాల్లో 9 మంది చొప్పున, నెల్లూరులో ఏడుగురు, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు చొప్పున, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, కడప జిల్లాలో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement